బాలయ్య మళ్లీ వివాదాల్లో ఇరుక్కున్నారు. వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ కి ముందు దేవ బ్రాహ్మణుల దేవుడు రావణాసురుడు అంటూ కామెంట్ చేసిన ఆయన తర్వాత క్షమాపణలు కూడా చెబుతూ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బాలయ్య బాబు అన్‌స్టాపబుల్ విత్ పవన్ కల్యాణ్ ఇటీవలే విడుదలైంది. ఈ ఏపిసోడ్ లో బాలయ్య బాబు నర్సుల గురించి అసహ్యంగా మాట్లాడారని పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే బాలయ్య ఆ మాటలను వెనక్కి తీసుకోవాలంటూ.. నర్సులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై బాలయ్య బాబు స్పందించారు.
ఓ లేఖ ద్వారా తాను మాట్లాడిన మాటలపై క్లారిటీ ఇచ్చారు. కావాలనే తనపై కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని… నర్సులను కించపరిచానంటూ చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటలను కావాలనే వక్రీకరించారని వివరించారు.
రోగులకు సేవలు అందించే తన సోదరీమణులు అంటే తనకెంతో గౌరవం అని ప్రకటించారు. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పుకొచ్చారు.
నర్సులకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనని వివరించారు. కరోనా వేళ తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎంతో మంది నర్సులు పగలనక రాత్రనక నిద్రాహారాలు మానేసి సేవలందించారని తెలిపారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకొని తీరాలన్నారు. నిజంగా తన మాటలు వారి మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని ప్రకటించారు.