సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ప్రసాదంలో పురుగులు రావడం కలకలం రేపింది. స్వామి వారి పులిహోర ప్రసాదం భక్తులు తింటున్న సమయంలో పురుగులు దర్శనమివ్వడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నగరానికి చెందిన ఓ భక్తుడు ఆదివారం స్వామివారిని దర్శించుకుని పులిహోర(ప్రసాదం) కొనుగోలుచేశారు. తినే సమయంలో పురుగులు కనబడడంతో అవాక్కయ్యారు. వెంటనే ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టనట్లు వ్యవహరించారని వాపోయారు.
స్వామివారి ప్రసాదాల్లో నాణ్యత కొరవడిందని భక్తులు సైతం ఆరోపించారు. తూకంలో కూడ 200 గ్రాములు బదులు150 నుంచి160 గ్రాముల పులిహోర ప్రసాదాన్నే అందిస్తున్నారని వారు తెలిపారు. ఈ విషయమై ఆలయ ఈఓ బాలాజీ ని వివరణ కోరగా భక్తులు ఎవ్వరు కూడా ప్రసాదంలో పురుగులు వచ్చినట్లు ఫిర్యాదు చేయలేదని, ఆవాస్తవం అని కొంత మంది కావాలనే ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నట్లు తెలిపారు.