డీవోపీటీ(డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ఉత్తర్వులు పాటించాల్సిందేనని, ఆంధ్రప్రదేశ్ లో రిపోర్టు చేయాల్సిందేనని క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్) ఇచ్చిన తీర్పుపై ఐఏఎస్ లు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. ఏపీలో రిపోర్ట్ చేయబోము అని ఐఏఎస్ లు అంటున్నారు. క్యాట్ తీర్పుపై హైకోర్టులో సవాల్ చేస్తామని ఐఏఎస్ ల తరుపు న్యాయవాదులు తెలిపారు. నేడు (అక్టోబర్ 16) హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేస్తామన్నారు.
అసలేం జరిగిందంటే..
తమను ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఐఏఎస్ అధికారులు వేసిన పిటిషన్ పై క్యాట్ ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. డీవోపీటీ ఆదేశాలను పాటించాలని ఆదేశాలిచ్చింది. ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ క్యాట్ ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్, సృజనలకు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ లో ఊరట లభించలేదు. పిటిషన్ పై విచారణ సందర్భంగా క్యాట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే అలాంటి చోటుకు వెళ్లి వారికి సేవ చేయాలని లేదా? అని ప్రశ్నించింది. ఐఏఎస్ లకు కేటాయింపులపై డీవోపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయని క్యాట్ స్పష్టం చేసింది.
స్థానికత ఉన్నప్పటికీ స్వాపింగ్ చేసుకునే అవకాశం గైడ్ లైన్స్ లో ఉందా? అని క్యాట్ ప్రశ్నించింది. వన్ మ్యాన్ కమిటీ సిఫార్సులను డీవోపీటీ పట్టించుకోడం లేదని ఐఏఎస్ అధికారుల తరపు న్యాయవాది క్యాట్ దృష్టికి తీసుకొచ్చారు. సింగిల్ మెన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసే ముందు కమిటీ నివేదికను ఇవ్వలేదన్నారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని పేర్కొన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో పని చేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రాస్ లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పని చేస్తున్న సృజన తెలంగాణకు రావాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం తాము పని చేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్ లో కోరారు.
కేటాయింపుల సమయంలో కేంద్రం తమ అభ్యర్థులను పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వాదనల అనంతరం డీవోపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు క్యాట్ నిరాకరించింది. ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.