AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రాజెక్టులన్నీ నిర్మించి తీరుతాం.. పాలమూరును సస్యశ్యామలం చేస్తాం

వలసల నుంచి ప్రజలను రక్షిస్తాం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
కురుమూర్తిస్వామికి ప్రత్యేక పూజలు

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి స్వామిని ఆదివారం సీఎం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ప్రజల ఆకాంక్షలతో పాటు స్వామివారి ఆశీస్సులతో అతి త్వరలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని భరోసా ఇచ్చారు. కురుమూర్తిస్వామి ఆలయంలో సంపూర్ణ వసతులు లేవనే విషయం తన దృష్టికి వచ్చిందని, అందుకే ఆలయ అభివృద్ధి కోసం రూ.110 కోట్లతో పైకి దారిని ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. పేదల తిరుపతిగా ఆలయాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా అంగరంగ వైభవంగా జాతర జరిపిస్తామని, అలాగే మన్నెంకొండ జాతరను, స్థానిక ఆలయాల్లోని అన్ని జాతరలను తాము గొప్పగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

వలసలకు మారుపేరు..
‘ఉమ్మడి రాష్ట్రంలో కానీ, గత ప్రభుత్వంలో కానీ పాలమూరు జిల్లా వలసలకు మారుపేరుగా నిలిచింది. తట్టపని, మట్టి పని చేసుకుంటూ అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేశారు. కానీ ఇక్కడ మన ప్రాజెక్టులు మాత్రం ఇప్పటికీ పూర్తి కాకపోవడానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యమే. 2009లో కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు గెలిపించి పార్లమెంట్‌కు పంపించినా ఆయన ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదు. అయితే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నా.. రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేకపోయారు’ అని సీఎం ఆరోపించారు.

సాగు నీటి ప్రాజెక్టులన్నీ పరుగులు పెట్టిస్తా..
‘జూరాల ప్రాజెక్ట్, కోయెల్‌ సాగర్, భీమా, నెట్టంపాడు, కల్వకుర్తి ప్రాజెక్ట్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ కావచ్చు. ఏదీ ఆయన పూర్తి చేయలేకపోయారు. ఆ నాడు దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ.. సాగునీటి ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలతో పోల్చారు. వాటిని అభివృద్ధి చేసుకోవాల్సిన సామాజిక బాధ్యత మనందరిదీ అని అన్నారు. వారి స్ఫూర్తిగా దేవాలయాలకు నిధులతో పాటు ఆధునిక దేవాలయాలైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి పచ్చటి పైర్లతో ఈ జిల్లాను విలసిల్లేలా చేసి వలసల నుంచి ప్రజలను రక్షిస్తాం’ అని రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10