మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేసి, మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
మన్మోహన్ సింగ్ మృతి వార్త తెలుసుకున్న సోనియా గాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు దిగ్బ్రాంతికి లోనయ్యారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు వారు ఫోన్ చేసి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్ చేసిన సేవలను వారందరూ కొనియాడారు.
మన్మోహన్ మరణంతో గురువు, మార్గదర్శిని కోల్పోయానని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అపారమైన జ్ఞానం, సమగ్రతతో దేశాన్ని ఆయన నడపించారని కొనియాడారు. ఆర్థిక శాస్త్రంలో ఆయనకు ఉన్న లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసించారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ప్రకటించారు.