మనం మారాలి.. మన ఆలోచనలు మారాలి
అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం
‘లోక్ మంథన్’ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఐకమత్యమే మన సభ్యత.. మన భవిష్యత్.. అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మొదట మనం మారాలి.. మన ఆలోచనలూ మారాలి.. అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధిస్తామని అన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా.. శుక్రవారం శిల్పకళావేదికలో లోక్ మంథన్‌ను గవర్నర్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడతూ.. సంస్కృతీ సంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం లోక్ మంథన్ అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. 2018 రాంచీలో జరిగిన లోకమంథన్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నానని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత మరోసారి లోకమంథన్‌లో పాల్గొనే అవకాశం కలిగిందని, ఇందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, మన పరంపర చాలా ఘనమైనవన్న ఆమె.. భిన్నత్వంలో ఏకత్వం గురించి మాట్లాడతాం.. పాటిస్తాం. ఇదే మన బలం, ఇదే మన స్థైర్యం అని తెలిపారు. ఇన్ని భిన్న సంస్కృతులు ఒకేచోట ఉండటం నిజంగా చాలా గొప్ప విషయమన్నారు. ద్రౌపది ముర్ము ఇవన్నీ కలిసిన సుందరమైన ఇంద్రధనస్సు లాంటి దేశం మనదని, మనం మనదేశాన్ని చూసి గర్వించాలని పేర్కొన్నారు.
మనమంతా భారతవాసులం..
వనవాసి, నగరవాసి అని తేడా లేకుండా మనమంతా భారతవాసులం అనే విషయాన్ని మరవకూడదని సూచించారు. లోకమంథన్ కార్యక్రమంలో.. అహల్యాబాయ్ హోల్కర్, రాణి రుద్రమదేవి వంటి వీరనారులపై నిర్వహిస్తున్నారని తెలిసి హర్షం వ్యక్తం చేశారు. వారి ప్రేరణ ఎప్పటికీ మనకు అవసరమని తెలిపారు.
విదేశాల్లోనూ మన సంప్రదాయాలు..
విదేశాల్లోనూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తుండటం అభినందనీయమన్నారు. ఇండొనేషియా సహా వివిధ దేశాల ప్రతినిధులు ఈ వేదిక ద్వారా తమ సంస్కృతిని ప్రదర్శిస్తుండటాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. భారతదేశ ఆధ్యాత్మిక భావనలు, కళలు, సంగీతలు, విద్య, వైద్య విధానాలు ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని పొందాయని, ప్రపంచానికి మనం జ్ఞాన దర్శనం చేశామని, ప్రపంచమంతా ప్రస్తుత సమయంలో మళ్లీ భారతదేశ జ్ఞానాన్ని పంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
‘విదేశీ శక్తులు శతాబ్దాలుగా మన మీద జులుం ప్రదర్శించాయి. మన సంస్కృతిని, భాషను, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను విధ్వంసం చేశాయి. మనలో ఐకమత్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారు. మనలో బానిస మూలాలను చొప్పించారు. కానీ మన దేశ ప్రజలు సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ.. వీటిని నిరంతరం జీవింపజేశారు. ఇకపైనా వీటిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. భారతదేశం బానిసత్వ మూలాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తోంది. రాజ్ పథ్ పేరు కర్తవ్యపథ్ మారింది. దర్బార్ హాల్ పేరు.. గణతంత్ర మండప్ గా మార్చాం. ఇది బానిసత్వ ఆలోచనలను తొలగించే దిశగా జరుగుతున్న ప్రయత్నం. మన ఆలోచనలు కూడా మారాలి. ఇటీవల.. ఓ హైకోర్టులో మహిళా జడ్జి విగ్రహాన్ని ప్రారంభించారు. కానీ ఆ విగ్రహం కళ్లకు నల్లని గంతల కట్టలేదు. ఇది మనం సాధిస్తున్న మార్పునకు సంకేతం. మన ఆలోచనలు కూడా మారాలి. అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలం. ఐకమత్యమే మన సభ్యత. మన భవిష్యత్తు. ఈ దిశగా మనమంతా కలిసి పనిచేద్దాం’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్ మంథన్ లో పిలుపునిచ్చారు.