తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాసి.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి రైల్వే టర్మినల్స్‌కు వెళ్లే రోడ్ల విస్తరణపై పలు విషయాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సంపూర్ణ సహకారం కావాలని అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, పదేళ్లుగా ఈ దిశగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని చెప్పారు.
తెలంగాణలో రైల్వే రంగం అభివృద్ధి మిషన్ మోడ్‌లో పూర్తవుతోందని అన్నారు. కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్ వంటి వాటితో పాటు లైన్ల ఎలక్ట్రిఫికేషన్ పనులు జరుగుతున్నాయని అన్నారు. 40కి పైగా స్టేషన్ల అభివృద్ధి పనులు శర వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకున్నామని తెలిపారు.
ఇందుకోసం నగర శివార్లలోని చర్లపల్లిలో రూ.415 కోట్లతో కొత్త రైల్వే టర్మినల్ నిర్మాణం పూర్తవుతోందని చెప్పారు. ప్యాసింజర్, గూడ్స్ రైళ్ల రాకపోకలకు కూడా చర్లపల్లి రైల్వేటర్మినల్ కేంద్రం కానుందని తెలిపారు. ప్రయాణికులకోసం వసతులు అన్నీ పూర్తవుతున్నాయని అన్నారు.
ఈ టర్మినల్ ప్రారంభోత్సవానికి రావడానికి ప్రధాని మోదీ అంగీకరించారని తెలిపారు. ఇటువంటి కీలకమైన రైల్వే టర్మినల్ చేరుకునేందుకు ఎఫ్‌సీఐ గోడౌన్ వైపు నుంచి ప్రయాణికుల రాకపోకల కోసం 100 అడుగుల రోడ్డు నిర్మాణం అవసరముందని చెప్పారు.
ఉత్తరం వైపు 80 అడుగుల మార్గం, మహాలక్ష్మినగర్ వైపు మరో 80 అడుగుల రోడ్డు అవసరం అవుతుందని తెలిపారు. ఇండస్ట్రియల్ షెడ్స్ ముందున్న రోడ్డును కూడా 80 ఫీట్లకు విస్తరించాలని చెప్పారు. ఈ పనులను త్వరగా పూర్తిచేయించేలా అధికారులను ఆదేశించాలని రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి కోరారు