అమెరికాలో హైదరాబాద్ వాసి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. 2023 ఏడాది మేలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళిన అబ్దుల్ మహ్మద్ ఆర్ఫద్ కిడ్నాప్‌కు గురికావడం కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నెల 8 వరకు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన అబ్దుల్ ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అతడి కుటుంబం కంగారుపడింది.
3 రోజుల క్రితమే అబ్దుల్ తండ్రికి కిడ్నాపర్లు ఫోన్ చేసి.. తామే కిడ్నాప్ చేశామని వెల్లడించారు. అంతేకాదు.. అడిగినంత డబ్బు ఇవ్వాలని లేదంటే అబ్దుల్‌ను చంపేస్తామంటూ బెదిరింపులకు తెగబడ్డారు. వెంటనే అబ్దుల్ తండ్రి సలీం నాచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అబ్దుల్ ఆచూకిని కనిపెట్టేందుకు సహకరించాలి : తండ్రి సలీం అభ్యర్థన
అబ్దుల్ తండ్రి సలీం మాట్లాడుతూ.. గత ఏడాది మేలో అమెరికా వెళ్ళినప్పుడు అబ్దూల్ బాగానే ఉన్నాడని, 8వ తేదీ వీడీయో కాల్ చేసి మాట్లాడాడని చెప్పారు. ఆ తర్వాత నుంచి అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని వాపోయారు. తమ అన్నయ్య కొడుకు అక్కడే ఉన్నాడని, అబ్దూల్ ఎలా ఉన్నాడో వెళ్లి చూడమని తన రూమ్‌కు పంపించామన్నారు. అతడి రూమ్ మేట్స్ కూడా అబ్దుల్ కనిపించడం లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పారు. అయితే, వారి ఫిర్యాదును అమెరికా పోలీసులు పట్టించుకోవడం లేదని చెప్పారు.
అబ్దుల్‌ను కిడ్నాపర్లు అపహరించిన 10 రోజుల తర్వాత ఒక వాట్సప్‌లో మెసేజ్ వచ్చిందన్నారు. 12 వందల డాలర్లు ఇవ్వాలని, అబ్దుల్ని కిడ్నాప్ చేశామంటూ మెసేజ్ పెట్టారు. అబ్దుల్ అదృశ్యమై దాదాపు 22 రోజులు అవుతుందని, వాట్సాప్ చాటింగ్ తప్ప ఎలాంటి వివరాలు తమకు తెలవదని తండ్రి సలీం ఆవేదన వ్యక్తం చేశారు. అబ్దుల్ ఆచూకిని ఎలాగైనా గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తమకు సహకరించాలని అబ్దుల్ తండ్రి సలీం కోరారు.