రెండు దశాబ్దాల్లో అమెరికా అధ్యక్షుడిగా పాపులర్ ఓటుతో ఎన్నికైన తొలి రిపబ్లికన్ పార్టీ నేతగా డొనాల్డ్ ట్రంప్ నిలుస్తారు. నార్త్ కరోలినా, జార్జియా రాష్ట్రాలతోపాటు కీలక స్వింగ్ రాష్ట్రాల్లో మెజారిటీ సాధించి వైట్ హౌస్ దిశగా అడుగులేస్తున్నారు ట్రంప్. నార్త్ కరోలినా, జార్జియా రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి- అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌పై స్వల్ప తేడాతో ట్రంప్ గెలుపొందారు. 2004లో జార్జి డబ్ల్యూష్ బుష్ పాపులర్ ఓటుతో గెలుపొందిన తొలి రిపబ్లికన్ పార్టీ నేత. 2004 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జార్జి డబ్ల్యూ బుష్ 6,20,40,610 ఓట్లతో 286 ఎలక్టోరల్ ఓట్లు పొందితే, సమీప ప్రత్యర్థి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జాన్ కెర్రీ 5,90,28,444 ఓట్లు ప్లస్ 251 ఎలక్టోరల్ ఓట్లు పొందారు.
గత 20 ఏండ్ల ఎన్నికల డేటా పరిశీలిస్తే 2008లో అత్యంత పాపులర్ 6.95 కోట్ల (52.9 శాతం) ఓటుతో 365 ఎలక్టోరల్ ఓట్లు పొందిన తొలి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. 2012లో అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించినా ఓటింగ్ శాతం 51.1 శాతానికి, ఎలక్టోరల్ ఓట్లు 332 ఓట్లకు తగ్గాయి. అలాగే, 2016 అధ్యక్ష ఎన్నికల్లో 46.5 శాతం పాపులర్ ఓటు పొందిన డొనాల్డ్ ట్రంప్ కు 304 ఎలక్టోరల్ ఓట్లే లభించాయి. కానీ, ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ 48.2 శాతం ఓట్లు పొందినా అధ్యక్ష పీఠానికి ఎన్నికవ్వలేకపోయారు. ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్‌కు 2.1 శాతం అధిక ఓటింగ్ లభించడం గమనార్హం. 2020 ఎన్నికల్లో జో బైడెన్ 51.3 శాతం పాపులర్ ఓట్లు, 306 ఎలక్టోరల్ ఓట్లు పొందారు. డొనాల్ట్ ట్రంప్ 7,42,23,975 ఓట్లూ 232 ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్నారు.
తాజా ఎన్నికల్లో నార్త్ కరోలినా, జార్జియా వంటి కీలక స్వింగ్ రాష్ట్రాల్లో ప్రారంభంలోనే డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యంలో ఉన్నా, అత్యంత కీలకమైన పెన్సిల్వేనియాలో విజయంతో తన ఖాతాలో 19 ఎలక్టోరల్ ఓట్లు సొంతం చేసుకున్నారు. పెన్సిల్వేనియా విజయం వైట్ హౌస్ లోకి ట్రంప్ ఎంట్రీ తేలిక చేసింది. ఇక సంప్రదాయంగా రిపబ్లికన్ పార్టీకి పట్టుగొమ్మలైన టెక్సాస్, ఫ్లోరియాడా రాష్ట్రాల్లో మరింత బలాన్ని ప్రదర్శించడంతో ఎలక్టోరల్ ఓట్ల కౌంటింగ్ లో కీలకంగా మారింది.