హైదరాబాద్‌లోని మల్లారెడ్డి హాస్పిటల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఠాగూర్ సినిమాలో మాదిరిగా డబ్బుల కోసం మృతదేహానికి ట్రీట్ మెంట్ చేసినట్లు నమ్మించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 4వ తేదీన కిడ్నీలో రాళ్లు వచ్చాయని మాధవి అనే మహిళ హాస్పిటల్ లో చేరింది.
అయితే సర్జరీ ఫెయిల్ కావడంతో ఆ మహిళ మృతి చెందిందని బంధువులు చెబుతున్నారు. అయితే డబ్బుల కోసం మృతదేహానికి ట్రీట్‌మెంట్ చేసినట్లు నటించారని వారు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ ఫెయిల్ అయిన విషయాన్ని తమకు చెప్పకుండా దాచారని.. వెంటలేటర్ పై ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నామని నమ్మించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిందని ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అయితే, కవవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మల్లా రెడ్డి ఆస్పత్రి బౌన్సర్లు దాడి చేశారు. దీంతో సూరారం పోలీస్ స్టేషన్‌లో మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
మూడు రోజుల క్రితం కిడ్నీలో రాళ్లు వచ్చాయని చికిత్స కోసం ఓ యువతి మల్లారెడ్డి ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ఆపరేషన్ చేయడంతో తీవ్ర రక్తస్రావానికి గురై శనివారం ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆస్పత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.