2024 ముగింపు దశకు చేరింది. 2025 ఏడాదికి స్వాగతం పలికేందుకు యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కొత్త ఆశలతో నూతన ఏడాదిని ఆహ్వానించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో ఈ ఏడాది మిగిల్చిన చేదు జ్ఞపకాలను కూడా నెమరువేసుకుంటున్నారు. ముఖ్యంగా 2024 ఏడాది ఎన్నో విషాదాలను మిగిల్చింది. అత్యాచార ఘటనలు, రోడ్డుప్రమాదాలు, ఉగ్రదాడులు, ప్రకృతి విపత్తులు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి.
వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విమాన ప్రమాదాలే. ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో విమాన ప్రమాదాలు చోటుచేసుకోగా.. ఆయా ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా డిసెంబర్‌లో ఏడు విమాన ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్కనెలలోనే విమానాల ప్రమాదాల కారణంగా 240 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏడాది ముగింపు వేళ చివరి నెల డిసెంబర్ విమానయాన చరిత్రలో ‘చీకటి నెల’గా (dark month) నిలిచింది. మొత్తంగా ఈ ఏడాది విమాన ప్రమాదాల్లోనే 430 మందికిపైగా మరణించారు. ఈ ఏడాది ఆరంభం నుంచి జరిగిన విమాన ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కోస్టు గార్డు ప్లేన్‌ను ఢీ కొట్టిన విమానం..
ఈ ఏడాది ఆరంభంలోనే జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ప్రమాదానికి గురైంది. జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏల్ 516 విమానం టోక్యో విమానాశ్రయంలో ఆగి ఉన్న కోస్టు గార్డు ప్లేన్‌ను ఢీకొట్టింది. ఆ సమయంలో భారీ స్థాయిలో మంటలు వ్యాపించాయి. మండుతున్న విమానం నుంచి కొందరు ప్రయాణికులు ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. హనెడా విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు బయటపడగా.. కోస్ట్ గార్డ్ విమానంలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఖైదీలతో వెళ్తున్న విమానం కూలి..
అదే నెల 24న (జనవరి) ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఖైదీలతో వెళ్తున్న రష్యా విమానం కుప్పకూలి 74 మంది దుర్మరణం చెందారు. అందులో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు కాగా.. తొమ్మిది మంది సిబ్బంది. ఉక్రెయిన్ సమీపంలోని బెల్గోరాడ్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
సైనిక విమానం కూలి 15 మంది మృతి
మార్చి 12న రష్యాలో సైనిక విమానం కుప్పకూలిపోయింది. రష్యా సైన్యానికి చెందిన ఐఎల్-76 రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రష్యా రాజధాని మాస్కోకు 125 మైళ్ల దూరంలోగల ఇవనోవోలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 15 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 8 మంది విమాన సిబ్బంది కాగా, మరో ఏడుగురు ప్రయాణికులు.
విమాన ప్రమాదంలో రైసీ మృతి
ఈ ఏడాది మేలో జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం చెందారు. మే 19న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అజర్‌బైజాన్ సరిహద్దులో ఇరు దేశాలు సంయుక్తంగా నిర్మించిన డ్యామ్ ప్రారంభోత్సవానికి వెళ్లిన అధ్యక్షుడు, తిరుగు ప్రయాణంలో తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా ఆయన వెళ్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో రైసీ సహా మొత్తం 8 మంది దుర్మరణం పాలయ్యారు.
మలావీ ఉపాధ్యక్షుడు సహా 10 మంది దుర్మరణం
జూన్‌లో ఆఫ్రికా దేశమైన మలావీలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా సహా 10 మంది దుర్మరణం చెందారు. మలావీ ఉపాధ్యక్షుడు, మరో తొమ్మిది మందిని తీసుకెళ్తున్న సైనిక విమానం జూన్ 10న అదృశ్యమైంది. రాజధాని లిలోంగ్వే నుంచి బయలుదేరిన విమానం 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతజర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా విమానం ల్యాండింగ్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి నిరాకరించింది. తిరిగి వెళ్లిపోవాలని సూచించింది. ఈ క్రమంలో కొద్దిసేపటికే రాడార్‌తో ఆ విమానానికి సంబంధాలు తెగిపోయాయి. జూన్ 11న ఆ విమానం కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఉపాధ్యక్షుడు సహా అందులోని వారంతా మరణించినట్లు ధృవీకరించారు.
నేపాల్ దుర్ఘటన..
జులై 24న నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. రాజధాని కాఠ్‌మాండూ (Kathmandu)లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శౌర్య ఎయిర్‌లైన్స్ (Saurya Airlines)కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి కూలిపోయింది (Plane Crashe). ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
బ్రెజిల్ ప్రమాదంలో 62 మంది మృతి
బ్రెజిల్‌లో ఆగస్టు 10వ తేదీన బ్రెజిల్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 62 మంది మరణించారు. వోపాస్ లిన్హాస్ ఏరియాస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం పరన రాష్ట్రంలోని కాస్కవెల్ నుంచి సావో పౌలోలోని గువారుల్హోస్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అప్పట్లో ఈ ఘటన బ్రెజిల్‌లో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది.
‘చీకటి నెల’ డిసెంబర్..
ఇక చివరి నెల అయిన డిసెంబర్‌ను వరుస విమాన ప్రమాదాలు పలకరించాయి. ఏకంగా ఏడు ఘటనలు చోటు చేసుకోగా అందులో 240 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏడాది ముగింపు వేళ చివరి నెల డిసెంబర్ విమానయాన చరిత్రలో ‘చీకటి నెల’గా (dark month) నిలిచింది.
దక్షిణ కొరియాలో ఆదివారం ఘోర విమాన ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. దాదాపు 179 మంది ప్రయాణికులు సజీవంగా దహనమయ్యారు. ల్యాండింగ్ అవుతున్న సమయంలో గేర్ పనిచేయకపోవడంతో విమానం వేగంగా రన్‌వేపై దూసుకువెళ్లి ఫెన్సింగ్ గోడను ఢీకొంది. వెంటనే విమానంలో మంటలు చెలరేగి అందులోని ఇద్దరు సిబ్బంది మినహా మొత్తం 179 మంది సజీవదహనం చెందారు. దక్షిణ కొరియా విమానయాన చరిత్రలోనే ఇది అత్యంత ఘోర ప్రమాదంగా భావిస్తున్నారు.
డిసెంబర్ 25న అజర్‌బైజాన్ విమానం కూలిన ప్రమాదంలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అజర్‌బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి బయల్దేరిన విమానాన్ని పొగమంచు కారణంగా కజకిస్థాన్‌లోని అక్టౌ విమానాశ్రయానికి మరలించారు. విమానం దానికి దగ్గర్లో ల్యాండ్ అవుతున్నప్పుడు పక్షి ఢీకొనడంతో కుప్ప కూలి మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో 37 మంది అజర్‌బైజాన్ వాసులు, 16 మంది రష్యన్లు, ఆరుగురు కజకిస్థానీలు, ముగ్గురు కిర్‌గిస్థానీ పౌరులు ఉన్నారు. ఈ ఘటనలో 38 మంది దుర్మరణం పాలయ్యారు. 27 మంది గాయపడ్డారు.
డిసెంబర్ 22న మూడు ప్రమాదాలు.. 19 మంది మృతి
డిసెంబర్ 22న బ్రెజిల్‌లో సంభవించిన విమాన ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. విదేశీ ప్రయాణికులతో వెళుతున్న ఓ బుల్లి విమానం ఆదివారం దక్షిణ బ్రెజిల్ టూరిస్ట్ సిటీ గ్రామాడోలోని దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో పది మంది ఉండగా.. వారంతా ప్రాణాలు కోల్పోయారు. క్రిస్మస్ పండుగకు కొద్ది రోజుల ముందు ఈ ఘటన జరిగింది. అందరూ పండుగ కోసం ముస్తాబవుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం స్థానికుల్లో విషాదాన్ని నింపింది.
ఇక అదే రోజుటర్కీలో కూడా ఇలాంటి ప్రమాదమే సంభవించింది. వైద్యులతో బయల్దేరిన అంబులెన్స్ హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది. రోగిని తీసుకొచ్చేందుకు టేకాఫ్ అయిన హెలికాప్టర్ హాస్పిటల్ భవనాన్ని ఢీకొట్టి, కుప్పకూలింది. అందులో ఉన్న ఇద్దరు పైలట్లు, ఒక డాక్టర్, ఒక ఆరోగ్య సంరక్షకుడు చనిపోయారు. టర్కీ ఆగ్నేయప్రాంతంలోని ముగ్లా నగరంలో డిసెంబర్ 22 ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 22న పాపువా న్యూ గునియాలో నార్త్ కోస్ట్ ఏవియేషన్ నిర్వహిస్తున్న చిన్న విమానం కూలి అందులో ఉన్న 5 మంది ప్రాణాలు కోల్పోయారు.
డిసెంబర్ 24న అర్జెంటీనాలో బార్డియర్ ఛాలెంజర్ 300 విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. డిసెంబర్ 17న హవాయిలోని హోనోలులులోని ఇనౌయే అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. విమానం లిఫ్ట్‌ఆఫ్ అయిన వెంటనే నియంత్రణ కోల్పోయి భవనాన్ని ఢీట్టింది.