ముంబై తీరంలో పెనువిషాదం చోటుచేసుకుంది. ఫెర్రీ సముద్రంలో మునిగిపోయిన ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులలో ముగ్గురు నేవీ సిబ్బంది కూడా ఉన్నారు. 101 మందిని రక్షించినట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సంఘటన వివరాల ప్రకారం, ‘గేట్‌వే ఆప్ ఇండియా’ నుంచి సుమారు 100 మంది పర్యాటకులతో ‘నీల్‌కమల్’ అనే ఫెర్రీ బయలుదేరింది. ఇదే సమయంలో చక్కర్లు కొడుతూ వేగంగా వచ్చిన నేవీ స్పీడ్ బోటు ఊహించనవిధంగా ఫెర్రీని ఢీకొట్టింది. ఫెర్రీ ఒక్కసారిగా తలకిందులై నీటమునిగి పోవడంతో హాహాకారాలు చెలరేగాయి. 11 నేవీ పడవలతో సహా 3 తీర ప్రాంత దళం పడవలు, నాలుగు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. పోర్ట్ అధికారులు, తీరప్రాంత సిబ్బంది, మత్స్యకారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఫడ్నవిస్
ముంబై తీరంలో జరిగిన ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలకు అధికారులను ఆదేశించారు. ఎలిఫెంటా కేవ్స్‌కు వెళ్తున్న నీల్‌కమల్ బోట్ ప్రమాదానికి గురైనట్టు సమాచారం అందిందని, తక్షణ సహాయక చర్యలకు నేవీ, కోస్ట్‌గార్డ్, పోర్ట్, పోలీసు టీమ్‌లను పంపామని సీఎం చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
రాష్ట్రపతి సంతాపం
ఇండియన్ నేవీ క్రాఫ్ట్ బోటు, ప్రయాణికుల ఫెర్రీ బోటు ఢీకొన్న దుర్ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. సహాయక చర్యలు విజయవంతం కావాలని, సురక్షితంగా బయటపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు సామాజిక మాధ్యమం “ఎక్స్”లో పోస్ట్ చేశారు.