తెలంగాణ తల్లి విగ్రహంపై అధికార–విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. బీఆర్‌ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి. మీరు అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని, మీ పనైపోయింది బిడ్డా.. దమ్ముంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని టచ్‌చేసి చూడు.. అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
దిగజారి మాట్లాడటమా?..
రాజకీయం కోసం బీఆర్‌ఎస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా కవిత, కేటీఆర్ మరింత దిగజారి మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. చట్టసభల ద్వారా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, విగ్రహం టచ్ చేసి చూడండంటూ కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు ఛాలెంజ్ విసిరారు.
ఇప్పుడు ప్రజల సొంతం..
తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు తెలంగాణ ప్రజల సొంతమని యెన్నం అన్నారు. తెలంగాణ తల్లి ఆవిష్కరణ జరిగి ప్రజలు సంతోషంగా ఉన్నారని, తెలంగాణ తల్లికి మట్టి గాజులే ఉంటాయి, ఆభరణాలు ఉండవన్నారు. కవిత మాటలు మరోలా ఉన్నాయన్నారు. అందుకే తెలంగాణ తల్లిలో బీదరికం కనిపిస్తోందన్నారు. కేసీఆర్ ఆనాడు ఏర్పాటు చేసిన విగ్రహం కేవలం శ్రామికవర్గానికి సంబంధం లేకుండా ఉందంటూ అభ్యంతరాలు వచ్చాయన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కేసీఆర్ అధికారికంగా జీవోలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పదేళ్లలో అసెంబ్లీ అంటే ఫామ్‌హౌస్, సెక్రటేరియేట్ అంటే ప్రగతి భవన్‌గా భావించిందన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీభవన్ తరలిస్తామని నేతలు చెప్పడంపై మండిపడ్డారు యెన్నం శ్రీనివాస్ రెడ్డి.