ఇది కదా సక్సెస్ అంటే..
సాధించాలనే తపన, లక్ష్యం ఉండాలే కానీ ఎంతటి ప్రతికూల పరిస్థితులైన అనుకూలంగా మారుతాయి. అన్ని ఉన్నా ఏదో లేదని బాధపడే వారు మనలో చాలా మందే ఉంటారు. అయితే ఏది లేకపోయినా ఆత్మ విశ్వాసం ఒక్కటి ఉంటే చాలని నిరూపించాడు ఓ యువకుడు. ఓవైపు వాచ్‌మెన్‌గా ఉద్యోగం చేస్తూనే మరోవైపు పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాడు. ప్రిపేర్ అవ్వడమే కాదు ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.
ఒకటి, రెండు, మూడు… ఇవేమీ కార్పొరేట్ విద్యాసంస్థలు ఇచ్చే ర్యాంకింగ్‌లు కాదు. అంతకన్నా విలువైనవి. ఓ వాచ్ మెన్ ప్రభుత్వ రంగంలో ఒకేసారి సాధించిన ఉద్యోగాలు. అవును.. ఆకలి, పట్టుదల, నిరంతర కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు ప్రవీణ్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రీసెర్చ్ సెంటర్ (EMRC) లో రాత్రిపూట వాచ్ మెన్‌గా పనిచేస్తున్నప్రవీణ్… పది రోజుల వ్యవధిలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. ఇటీవలే తెలంగాణ గురుకుల విద్యాలయాల బోర్డు ప్రకటించిన ఫలితాల్లో… టీజీటి, పీజీటి, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించారు.
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్ గ్రామానికి చెందిన ప్రవీణ్ ప్రాధమిక విద్య నుంచి డిగ్రీ వరకు జెన్నారంలో పూర్తి చేశారు. ప్రవీణ్ తండ్రి పెద్దులు మేస్త్రీ పనిచేస్తుండగా… తల్లి పోసమ్మ బీడీ కార్మికురాలిగా పనిచేస్తు ప్రవీణ్‌ను చదివించింది. తల్లిదండ్రులు కష్టాన్ని చూసిన ప్రవీణ్ ఉన్నత ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఎంకాం, బీఈడీ, ఎంఈడీ ఓయూ క్యాంపస్ లో చదుపుకున్నారు. ఖర్చుల కోసం ఈఎమ్మార్సీ లో ఐదేళ్లుగా వాచ్ మెన్ గా ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్దమయ్యాడు.