ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ ప్రేమలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి. జస్ట్ అలా పరిచయం.. ఇలా పెళ్లి జరిగిపోతోంది కొన్ని జంటలకు. కొందరికి మాత్రం ఇబ్బందులు తప్పని పరిస్థితి. అయితే ఈ జంట మాత్రం సేమ్ టు సేమ్ ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమయ్యారు. పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లైన పది రోజులకే, అడవి బాట పట్టించాడట ప్రియుడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా అల్వాల్ లో జరిగింది.
ప్రేమ పేరుతో మోసపోయిన యువతి తెలిపిన వివరాల మేరకు.. బెంగుళూరుకి చెందిన యువతి రబియాకి, మహారాష్ట్రకు చెందిన విక్రమ్ మన్వర్ లకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరిచయం ఏర్పడింది. రాష్ట్రాలు వేరైనప్పటికీ ప్రేమ వీరిద్దరినీ కలిపింది. ముందు మాటలు సాగించిన వీరు, 8 నెలలు సహజీవనం సాగించారట. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు ఈ జంట. అలా పెళ్లి చేసుకున్న వీరు, జీవనోపాధి కోసం బెంగుళూరు నుంచి మేడ్చల్ జిల్లా అల్వాల్ వచ్చి కొన్ని రోజులుగా కాపురం ఉంటున్నారు.
అయితే సాఫీగా సాగిన వీరి సంసారంలో, పట్టుమని పది రోజుల్లోనే విబేధాలు వచ్చాయి. రబియాపై అత్తమామలు, భర్త వెళ్లి పోవాలని ఒత్తిడి చేయడంతో దిక్కు తోచక అలాగే ఉండేదట రబియా. ఈ నేపథ్యంలో ప్రేమ పేరుతో మోసపోయానని మనస్థాపానికి గురైన రబియా నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది.
ఆ తర్వాత సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటిమామిడి అటవీ ప్రాంతంలో భర్త విక్రమ్ మన్వర్, ఆమెను వదిలివేసినట్లు రబియా ఆరోపిస్తోంది. ప్రేమ పేరుతో మోసపోయిన తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. ప్రేమ పేరుతో బెంగుళూరు నుండి వచ్చి ప్రేమ పెళ్లి చేసుకున్న తనకు జరిగిన అన్యాయంపై పోలీసులు దృష్టి సారించి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.