AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇది గారడీ సర్కార్‌.. కాంగ్రెస్‌పై సమరశంఖం పూరించిన తెలంగాణ బీజేపీ నేతలు..

 ఇంతకాలం సైలెంట్‌గా తెలంగాణ బీజేపీ నేతలు.. ఒక్కసారిగా దూకుడు పెంచాడు. సరూర్ నగర్ వేదికగా భారీ బహిరంగ సభ పెట్టి.. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటై ఏడాది పూర్తైన సందర్భంగా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే లక్ష్యంతో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రసంగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం రానుందన్నారు. 12 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమ శంఖారావం పూరించామని కిషన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీదే గెలుపు అని ధీమా వ్యాక్తం చేశారు కేంద్ర మంత్రి. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం అని ఉద్ఘాటించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆర్‌కే సర్కార్ నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ లీడర్ ఫామ్‌హౌస్‌కు పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. రేవంత్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. సీఎం రేవంత్‌కు సంక్రాంతి వరకు సమయం ఇస్తున్నామని.. ఆ తరువాత ఏ ఒక్క కాంగ్రెస్ నేతను రోడ్లపై తిరగనివ్వమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేనని విమర్శించారు బండి సంజయ్. 20 వేల ఉద్యోగాలు ఇచ్చి.. 55 వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. కొత్త జీవోలు తెచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. 317 జీవో గురించి సీఎం రేవంత్ ఎందుకు మాట్లాడటం లేదని కేంద్ర మంత్రి సూటిగా ప్రశ్నించారు.

బీసీ సబ్ ప్లాన్ అమలు ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కేంద్రమంత్రి బండి సంజయ్. దేవాలయాలపై దాడులను ప్రజలు మర్చిపోరన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. భాగ్యనగర్‌ను బంగ్లాదేశ్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రులు ఏం తెచ్చారని ప్రశ్నిస్తున్న రేవంత్‌.. ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేశారు ప్రశ్నించారు. కేంద్రం డబ్బులతో కట్టి.. ఇందిరమ్మ ఇళ్లు అంటున్నారని విమర్శించారు. ప్రధాని ఫొటో లేకుండా ఇళ్లు పంపిణీ చేస్తే అడ్డుకుంటామని తేల్చి చెప్పారు బండి సంజయ్.

ఎంపీ లక్ష్మణ్ కామెంట్స్..

ఎన్నికల హామీలను కాంగ్రెస్ అటకెక్కించిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. రైతుభరోసా ఇవ్వలేదు.. రైతుబంధు ఆపేశారన్నారు. 74 లక్షల మంది రైతులు అప్పులు తీసుకుంటే.. కేవలం 24లక్షల మందికే రుణమాఫీ చేశారని పేర్కొన్నారు. రుణమాఫీపై మంత్రులు పొంతనలేని మాటలు చెబుతున్నారని విమర్శించారు. దేశాన్ని అస్థిరపర్చేలా కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందని ఎంపీ ఆరోపించారు.

ఏం చేశారని సంబరాలు..

ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయిందని.. ఏడాదిలో ఏం చేశారని కాంగ్రెస్ సంబరాలు చేస్తోందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. 70 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉండగా.. కేవలం 22 లక్షల మంది రైతులకు మాత్రమే చేశారన్నారు. ఏ ముఖం పెట్టుకొని.. ఏం వెలగబెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి తరహాలో రేవంత్ మాట్లాడుతున్నారా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో భాష, గౌరవం లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ సీఎం తీరును తప్పుపట్టారు. లంకె బిందెలు తవ్వుకోవడానికి సీఎం అయ్యావా.. లేక ప్రజలకు సేవ చేయడానికి సీఎం అయ్యారా అని నిలదీశారు. పేద ప్రజలకు న్యాయం చేసే వరకు బీజేపీ పోరాటం చేస్తోందన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10