AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ కేసు నిలబడదు.. ఇందులో అణాపైసా అవినీతి లేదు

ఆ విషయం వాళ్లకు, నాకు తెలుసు..
ఏసీబీ కేసుపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

ఫార్ములా ఈ–కార్‌ రేసు వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేయడంపై శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్‌ స్పందించారు. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ అవినీతి జరుగలేదని, విధానాల లోపం అని వెల్లడించారని కేటీఆర్‌ గుర్తు చేశారు. ప్రభుత్వానికి సమాచార లోపం ఉంది.. ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు. కేసు నిలబడదు. ఆ విషయం వాళ్లకు తెలుసు.. నాకు తెలుసు అని కేటీఆర్‌ అన్నారు. కేసుపై అన్ని రకాలుగా ముందుకు వెళ్తాం. ఈ కేసులో అణాపైసా అవినీతి లేదు.. ప్రభుత్వం కేసుపై ముందుకెళ్తే న్యాయపరంగా ఎదుర్కొంటాం అని కేటీఆర్‌ చెప్పారు.

ఆ పద్ధతి దేశంలో ఇప్పటికే ఉంది..
‘టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ ఫర్‌ పద్ధతి దేశంలో ఇప్పటికే ఉంది. ఓఆర్‌ఆర్‌ లీజు డబ్బు రైతు రుణమాఫీకి వాడాం. అప్పటి కేబినెట్‌ సబ్‌ కమిటీ.. ఓఆర్‌ఆర్‌ లీజుకు సూచించింది. నేషనల్‌ హైవే అథారిటీ తరహాలోనే ఓఆర్‌ఆర్‌ ను లీజుకు ఇచ్చాం. అవినీతి జరిగితే ఆ ఒప్పందం ఇంకా ఎందుకు రద్దు చేయలేదు..? కోకాపేట భూములపై రూ. 10వేల కోట్ల స్కామ్‌ అంటున్నారు. అవినీతి జరిగిందని భావిస్తే కోకాపేట భూముల అమ్మకం కూడా రద్దు చేయాలి’’ అని కేటీఆర్‌ అన్నారు.

త్వరలో నోటీసులు..
ఫార్ములా ఈ–కార్‌ రేసు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎస్‌ రెడ్డిని చేర్చారు. నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. కేబినెట్‌ అనుమతి, ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ లేకుండానే విదేశీ కంపెనీకి సుమారు రూ.55కోట్ల నిధులు చెల్లించారని ఎఫ్‌ఐఆర్‌ లో పేర్కొన్నారు. అయితే, రెండు మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌ కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే, తాజాగా కేటీఆర్‌ ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10