నా మీద ఎందుకు కేసులు పెడుతావ్.. హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుకా..? అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. జైలుకు వెళ్లేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఫార్ములా-ఈ రేస్ విషయంలో మీడియాకు చెప్పిందే.. అక్కడ చెబుతా. గవర్నమెంట్‌గా నిర్ణయం తీసుకున్నానని చెబుతాను. హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి దృష్ట్యా నిర్ణయం తీసుకున్నాను. నా మీద కేసులు ఎందుకు పెడుతావ్.. హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుకా..? లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకా..? ప్రపంచపటంలో హైదరాబాద్‌ను నిలబెట్టినందుకా..? బెంగళూరును దాటి హైదరాబాద్‌లో ఐటీ ఎగుమతులు పెంచినందుకా..? పారిపోతాయన్న కంపెనీలను కాపాడినందుకా..? దిగ్గజ కంపెనీలకు డ్రీమ్ డెస్టినేషన్‌గా మార్చినందుకా..? కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర పిల్లల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసినందుకా..? అటెన్షన్ డైవర్షన్ గేమ్‌లతో రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు తప్పించుకోలేడు.
నువ్వు ఎన్ని వేషాలు వేసినా.. మేం నిన్ను విడిచిపెట్టం. ఆరు గ్యారెంటీలను వదిలిపెట్టం. అప్పుడప్పుడు నువ్వు గోకినట్టు చేస్తే మేం కూడా వివరణ ఇస్తాం ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఇన్ని చెప్పినా కూడా కేసు పెడుతాం అంటే నీ ఇష్టమున్న కేసు పెట్టుకో అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ తేల్చిచెప్పారు.