బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే వారం, పది రోజుల్లోనే రైతుబంధు రైతుల ఖాతాలో పడేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలో ఆయన పర్యటించారు. అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి బీఆర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇష్టం వచ్చిన హామీలను ఇచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని కాంగ్రెస్ నేతలు ఇటుకలతో కొట్టారని, మనం రాళ్లతో కొట్టే రోజులు వస్తాయన్నారు.
మహబూబ్‌నగర్‌లో 12 సీట్లు గెలుస్తామని అనుకోలేదని అసెంబ్లీలో వాళ్లే చెబుతున్నారని విమర్శించారు. అనుకోకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రాష్ట్రంలో కరెంట్, నీటి కష్టాలు అప్పుడే మొదలయ్యాయని దుయ్యబట్టారు. దేశంలో ప్రధాని మోడీ హవా ఏమి లేదని, పదేళ్లైనా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ కోసం కొట్లాడలంటే బీఆర్‌ఎస్ నాయకులు పార్లమెంట్‌లో ఉండాలన్నారు. 24 జోరుగా వెళ్లిన కారు.. ఒకటి, రెండు నెలలు సర్వీసింగ్‌కు వెళ్లిందని, పార్లమెంట్ ఎన్నికల్లో 100 కిలోమీటర్ల వేగంతో ముందుకు వెళ్దామని కేసీఆర్ అన్నారు.