మంచు ఫ్యామిలీ పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. తండ్రీ కొడుకులు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్.. పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ కు మోహన్ బాబు లేఖ రాశారు. మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు కంప్లైంట్ ఇచ్చారు. మనోజ్, మౌనికల నుంచి రక్షణ కల్పించాలని ఆయన పోలీసులను కోరారు.
అటు మంచు మనోజ్ సైతం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి జరిగిందని మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు. హాస్పిటల్ రికార్డులను ఆధారాలుగా చూపించారు. దోషులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న గాయాలతో ఆసుపత్రికి వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకున్నారు మంచు మనోజ్. అయితే, అంతకుముందు మాదాపూర్ లో మోహన్ బాబు నివాసంలో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో మనోజ్, మోహన్ బాబు, చిన్న శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు. ఈ భేటీ తర్వాత మనోజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే, కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదని సీఐ తెలిపారు. 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మనోజ్ చెప్పారని సీఐ వెల్లడించారు.
ఫిర్యాదు కాపీలో మంచు మనోజ్..
‘నా భార్య పిల్లలపై నేను ఇంట్లో లేని సమయంలో 10మంది కలిసి దాడికి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ కు వెళ్లాల్సి ఉంది. నేను ఇంట్లో లేను అనే సమాచారం తెలుసుకొని నా భార్య పిల్లలపై దాడికి పాల్పడ్డారు. కానీ నేను షూటింగ్ రద్దు చేసుకొని అప్పటికే ఇంట్లో ఉన్నాను.
దుండగులను పట్టుకునే క్రమంలో నాకు గాయాలయ్యాయి. వెంటనే నా భార్యను తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళాను. నిన్న రాత్రి ఇంటికి తిరిగి వెళ్లి చూసేసరికి ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ మొత్తం లేకుండా చేశారు. విజయ్ రెడ్డి, కిరణ్ కలిసి సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు. విషయాన్ని బయటికి రానివ్వకుండా విజయ్ రెడ్డి అడ్డు పడుతున్నాడు. అసాంఘిక శక్తుల నుండి నా కుటుంబాన్ని రక్షించండి. వారితో నాకు ప్రాణహాని ఉంది’.