అధికారులుంటే నిర్ధాక్షిణ్యంగా విధుల్లోంచి తొలగిస్తాం
మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక భారీ కుట్ర దాగి ఉందని అన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇటీవల తెలంగాణలోని పలు గిరిజన హాస్టళ్లు, మిడ్ డే మిల్స్‌లో ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా, ఈ ఘటనలపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫుడ్ పాయిజన్ వెనక కుట్ర ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. కుట్ర వెనక ఎవరున్నా వదలేది లేదని హెచ్చరించారు. ఆ కుట్రలు ఎవరు చేశారనే విషయాన్ని త్వరలోనే బయటపెడతామని అన్నారు. ఒకవేళ కుట్రదారుల వెనుక అధికారులుంటే వారిని ఉద్యోగం నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక ఓ రాజకీయ పార్టీ ఉందని తమకు అనుమానంగా ఉందని తెలిపారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ తలసానిదే..
ఆనాడు దిలావర్పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని మంత్రి ఫైర్ అయ్యారు. అక్కడి ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశారని గుర్తు చేశారు. నేడు మళ్లీ కేటీఆర్ తమపై నిస్సిగ్గుగా మాపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. కంపెనీ డైరెక్టర్‌గా తలసాని సాయికిరణ్ ఉన్నాడని ఆరోపించారు. కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే దిలావర్పూర్ కు వచ్చి అనుమతులు ఇచ్చింది తనేనని ఒప్పుకోవాలని అన్నారు. అసెంబ్లీ లోనూ ఇథనాల్ కంపెనీ పై చర్చ పెడతామని.. కేటీఆర్ ఇచ్చిన అనుమతులను బయటపెడతామని మంత్రి సీతక్క అన్నారు.