సమాజంలో అందరూ చదువుకోవాలన్నదే జ్యోతిభా పూలే ఆలోచన అని, తల్లిదండ్రులు ఓ పూట పస్తులుండైనా పిల్లలను మాత్రం మంచి చదువులు చదివించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… సంఘ సంస్కర్త, మానవతావాదిగా మహాత్మా జ్యోతిరావు పూలే చరిత్రలో నిలిచిపోయారన్నారు. సమాజంలో అందరూ చదువుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగిన మహనీయులు పూలే అని, ఆయన ఆశయ సాధన కోసం తల్లిదండ్రులు ఒక పూట తినకున్నా మీ పిల్లలను మంచిగా చదివివించాలని కోరారు. అక్షర జ్ఞానంతోనే ఏ కుటుంబమైనా అన్ని విధాలుగా ప్రగతి సాధిస్తుందన్నారు.
చదువు, తెలివి ఎవరికి సొంతం కాదని, అందరికీ ఉపయోగ పడుతుందన్నారు. జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా మనమంతా ఒక ప్రతిజ్ఞగా తీసుకొని ఏపని చేసినా మన ధర్మాన్ని నెరవేర్చాలనే సదుద్దేశంతో పని చేయాలన్నారు. జ్యోతిరావు ఫూలేను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. చదువు జ్ఞానాన్ని, కుటుంబ ప్రగతిని మన వ్యవస్థకు మేలు చేస్తుందన్నారు. అలాగే అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, సమయానికి తినాలన్నారు. ఇంటి పరిసరాల్లో అవసరానికి ఉపయోగపడే మొక్కలు నాటాలని, అందరిలో మార్పు రావాలనే ఉద్దేశంతో పూలే తెచ్చిన సంస్కరణల వల్లే ఆయన విగ్రహాన్ని పెట్టుకున్నామన్నారు.
వారి ఆలోచన విధానం ముందుకు తీసుకుపోదామన్నారు. ఈకార్యక్రమంలో కరీంనగర్, సిద్దిపేట కలెక్టర్లు పమేలా సత్పతి, మను చౌదరి, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, సుందరగిరి గ్రామ స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్ ముద్దసాని రమేష్, నాయకులు పాల్గొన్నారు.