హైదరాబాద్ హయత్‌నగర్‌లో అంబులెన్స్ చోరీ చేసిన ఓ దొంగ దాన్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో హైదరాబాద్-విజయవాడ హైవేపై హల్‌చల్ చేశాడు. పోలీసులు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వేగంగా దూసుకెళ్లాడు. యాక్షన్ మూవీ తరహాలో ఛేజింగ్ చేసిన పోలీసులు చివరకు నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం టేకుమట్ల వద్ద అంబులెన్స్‌ను, దొంగను అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఇవాళ ఉదయం ఓ పేషెంట్‌ను తీసుకొని 108 వాహనం హయత్ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లింది. 108 సిబ్బంది పేషెంట్‌తో సహా.. ఆసుపత్రిలోకి వెళ్లగానే.. ఓ దొంగ అంబులెన్స్‌ను స్టార్ట్ చేసి ఎత్తుకెళ్లిపోయాడు. హాస్పిటల్ నుంచి బయటికి వచ్చిన 108 సిబ్బంది.. అంబులెన్స్ లేదని గుర్తించారు. వెంటనే పోలీసుల సాయంతో హయత్ నగర్ హాస్పిటల్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. అంబులెన్స్‌ని ఎవరో ఎత్తుకెళ్లినట్లుగా కెమెరాలో గుర్తించారు. వెంటే 108 కంట్రోల్ రూమ్‌కి ఫిర్యాదు చేయగా.. వారు చౌటుపల్లి పోలీసులను అలెర్ట్ చేశారు.
చౌటుప్పల్ టోల్ గేట్ వద్ద పోలీసులు మాటు వేశారు. అంబులెన్స్‌ను పట్టుకునేందుకు బారీకేడ్లను ఏర్పాటు చేశారు. అయితే బారికేడ్లను ఢీకొట్టి మరి అంబులెన్స్‌తో సహా దొంగ విజయవాడ వైపు పారిపోయాడు. దీంతో చిట్యాల వద్ద మరోసారి అంబులెన్స్ అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులను ఢీకొట్టి మరీ పారిపోయాడు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ జాన్ రెడ్డికి గాయాలైనట్లు తెలిసింది. కట్టంగూరు, కేతేపల్లి పోలీసులు అప్రమత్తమై… కొర్లపాడు టోల్గెట్ వద్ద ఆపేందుకు ప్రయత్నించారు. అయితే టోల్ బూత్ ఢీకొట్టి అంబులెన్స్‌ను తీసుకెళ్లాడు. దీంతో కేతపల్లి ఎస్సై శివతేజ తన సిబ్బందితో సహా.. అంబులెన్స్‌ను వెంబడించాడు.
టేకుమట్లకు చేరుకోగానే.. అదుపుతప్పి అంబులెన్స్ బ్రిడ్జి పై నుంచి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. దాంతో తప్పించుకునే వీలు లేక దొంగ పోలీసులకు చిక్కాడు. కల్వర్టులోకి దూసుకెళ్లిన అంబులెన్స్, దొంగను బయటకు తీసి గాయపడ్డ దొంగను ఆసుపత్రికి తరలించారు. ఇవాళ ఉదయం 5 గంటల దొంగ అంబులెన్స్ ఎత్తుకెళ్లగా.. దాదాపు రెండున్నర గంటల పాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు.
కాగా, అంబులెన్స్ ఎత్తుకెళ్లిన దొంగ వివరాలు తెలుసుకోగా.. గతంలోనూ ఇతడు దొంగతనాలు చేసినట్లు తెలిసింది. తనకు ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ వెళ్లేందుకు అంబులెన్స్‌ను తీసుకెళ్లినట్లుగా అతడు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీన్ని బట్టి అతని మానసిక పరిస్థితి బాగోలేదని పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.