తెలంగాణలోని మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందుకోసం ప్రతిఏటా మహిళకు వడ్డీలేని రుణాలు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇందుకోసం ప్రతి ఏడాది రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల మేర రుణాలు మహిళలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈరోజు పర్యాటక భవన్‌లో తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసిన స్టాళ్లు పరిశీలించారు భట్టి.. అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. భవిష్యత్తులో అవి మధ్య, భారీ పరిశ్రమలుగా అభివృద్ధి చెందాలని అన్నారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని భరోసా ఇచ్చారు. గ్రామీణ మహిళల్లోనూ వ్యాపారదక్షత ఉంటుందని.. పర్యావరణానికి హాని కలగకుండా చేసే ఉత్పత్తులను ఆదరించాలని విక్రమార్క కోరారు.