హైదరాబాద్ మహానగరంలో కోడి గుడ్డు ధర అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం ఒకొక్క కోడిగుడ్డు రూ. 7 ధర పలుకుతోంది. మరికొద్ది రోజుల్లో క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీంతో కేక్‍లకు భారీ డిమాండ్ ఏర్పడనుంది. ఇక వీటి తయారీలో కోడిగుడ్డను విరివిగా వినియోగిస్తారు. దీంతో కోడి గుడ్ల రేట్లు భారీ పెరిగాయి. నిన్న మొన్నటి వరకు ఒక్కో కోడిగుడ్డు ధర రూ. 5 లేదా రూ. 6 మధ్య ఉండేది. 100 కోడిగుడ్ల ధర.. హోల్ సేల్‍గా రూ. 540 లేదా అంతకంటే తక్కువగా ఉండేది.
అలాగే షాపుల్లో రూ. 6గా ఉండేది. కానీ కోడిగుడ్ల ధర మాత్రం ఇటీవల భారీగా పెరిగింది. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలోనే కోడిగుడ్డు ధర ఇంతలా పెరిగిందనే అభిప్రాయం అయితే సర్వత్ర వ్యక్తమవుతోంది. ఇక హోల్ సేల్ మార్కెట్‍లో 100 కోడిగుడ్ల ధర.. రూ. 620 ఉంది. అయితే రిటైల్ వ్యాపారులు మాత్రం 100 కోడిగుడ్లను రూ. 650కి విక్రయిస్తున్నారు.
అదే విధంగా రిటైల్ మార్కెట్‍లో మాత్రం 100 కోడిగుడ్ల ధర.. రూ. 700కి చేరుకుంది. సూపర్ మార్కెట్ లో వీటి ధర మరింత భారీగా పెరిగింది. ఒక్కో గుడ్డు ధర రూ. 10 మేర విక్రయిస్తున్నారు. మరోవైపు నేషనల్ ఎగ్ కో ఆర్డినేటడ్ కమిటీ (ఎన్ఈసీసీ) మాత్రం ఒక్కో గుడ్డు ధర రూ. 6.20గా నిర్ణయించింది.