కల్లు తాగేందుకు వెళ్తుండగాప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కారు చెరువులోకి దూసుకెళ్లడంతో ఐదుగురు జలసమాధి అయ్యారు. వీరంతా విద్యార్థులే.. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ సమీపంలో కారు చెరువులోకి దూసుకు వెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెరువులోకి దూసుకెళ్లిన కారు ఈ ప్రమాదంలో అయిదుగురు విద్యార్థులైన యువకులు చెరువులో జల సమాధి అయ్యారు.
ఈ ఘటన వివరాలలోకి వెళితే కొందరు యువకులు శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి∙వలిగొండకు బయలుదేరారు. తాటికల్లు తాగేందుకు బయలుదేరిన వీరంతా మితిమీరిన వేగంతో వెళ్లడంతో పాటు దట్టమైన పొగ మంచు ఉండటం వల్ల కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకు వెళ్లింది.
ఎవరికీ ఈత రాకపోవడంతో..
వీరు చెరువులో నుంచి బయటపడడానికి ప్రయత్నించినప్పటికీ ఎవరికీ ఈత రాకపోవడంతో ఐదుగురు మృతి చెందారు. హర్ష, దినేష్, బాలు, వంశీ, వినయ్ ఈ దారుణ ఘటనలో మృత్యువాత పడినట్లు గుర్తించారు. వీరంతా 22 నుంచి 25 ఏళ్లలోపువారే. మరో యువకుడు మణికంఠ మాత్రం కారు అద్దాలు పగలగొట్టి ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతనిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మద్యం మత్తులో…
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మణికంఠకు మద్యం టెస్ట్ నిర్వహించగా నిన్న రాత్రి అతను మద్యం తాగినట్టు తెలుస్తుంది. నిన్న రాత్రి కారులో ఉన్న యువకులు అందరూ మద్యం సేవించినట్లు సమాచారం. ఇక దీనిని బట్టి రాత్రంతా వారు మద్యం తాగి మరల ఉదయం అదే మత్తులో తాటికల్లు తాగడానికి బయలుదేరినట్టు భావిస్తున్నారు.
ఐదుగురి కుటుంబాల్లో తీవ్ర విషాదం
ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు పదేపదే చెప్తున్నా‡ చాలా మంది నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతున్నారు. ఇది ఒక్కోసారి వారి ప్రాణాల మీదికి తెస్తుంది. ఈ ఘటనపై పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.