పల్నాడు: పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చుకునేందుకు బస్సులో గుడికి వెళ్తుండగా అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మంది గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీసి సమీస ఆసుపత్రికి తరలించారు. ఈ షాకింగ్ ఘటన పల్నాడు జిల్లాలో ఆదివారం (మార్చి 17) చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పల్నాడు జిల్లా అద్దంకి మండలం తిమ్మాయిపాలెం సమీపంలో కోటప్పకొండకు వెళ్తున్న బస్సు బోల్తా పడింది. బాపట్ల జిల్లా బొద్దికూరపాడుకు చెందిన సుబ్బారెడ్డి తమ కుటుంబ సభ్యులతో మనవరాలు పుట్టువెంట్రుకలు తీసుకునేందుకు కోటప్పకొండకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు. తాళ్లూరు మండలం బొద్దికూరపాడు, దర్శి మండలం కొర్లమడుగు గ్రామాలకు చెందిన సుమారు 60 మంది బంధువులను ఓ ప్రైవేట్ బస్సులో కోటప్పకొండకు బయల్దేరారు. బస్సు ఓ స్కూలు బస్సులో వెళ్తుండగా.. బస్సు కట్టర్ విరిగిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి తిమ్మాయపాలెంలోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో రోడ్డుపై బస్సు ఒక్కసారిగా బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో 40 మందికి తీవ్రంగా గాయాలపాలయ్యారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను బస్సు నుంచి వెలికితీసి ప్రైవేటు వాహనాల్లో అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం 108 వాహనాల్లో వారందరినీ ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం వల్ల రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఒంగోలు రిమ్స్‌కు బాధితులను తరలించేందుకు అద్దంకి సీఐ సీ కృష్ణయ్య, ఎస్సై నాగరాజు, ఇతర పోలీసు సిబ్బంది ఏర్పాట్లు చేశారు.