కలుషిత ఆహార ఘటనలపై నిగ్గుతేలుస్తాం
ఎంతటి వారున్నా వదలం
గురుకులాల్లో కలుషిత ఆహార ఘటనలపై మంత్రి సీతక్క
గురుకులాల్లో కలుషిత ఆహార ఘటనలపై శాసన మండలిలో మంగళవారం మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. జరుగుతున్న ఘటనలపై మాకు అనుమానాలు ఉన్నాయని, బయటకు తీస్తామన్నారు. ఎవరున్నా వదలమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే బీఆర్‌ఎస్ వాళ్లు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని మండిపడ్డారు. మాకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే తెలుసు.. బీఆర్‌ఎస్ వాళ్లమాదిరి యాక్టింగ్ రాదన్నారు. బీఆర్‌ఎస్ వాళ్లు మాట్లాడితే నిలువెల్లా అహంకారమే కనిపిస్తోందని తెలిపారు. ఏడు సంవత్సరాల తర్వాత డైట్ చార్జీలను పెంచామని, 16 ఏండ్ల తర్వాత కాస్మొటిక్ చార్జీలను సైతం పెంచామని మంత్రి తెలిపారు.
అన్ని చర్యలు తీసుకుంటున్నాం..
మా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోందన్నారు. హాస్టల్ సిబ్బందితోపాటు సప్లయర్లపై నిఘా పెడతామన్నారు. గత బీఆర్‌ఎస్ హయాంలో 70 ఘటనలు, 5,024 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలకు చెందిన శైలజను బతికించేందుకు కష్టపడ్డామన్నారు. నిమ్స్ లో శైలజను మంత్రులు, సీఎంవో సిబ్బంది నిరంతరం పర్యవేక్షించారని తెలిపారు. మీ హయాంలో నిరుద్యోగులు చనిపోతే తల్లిదండ్రులకు శవాలను కూడా చూపించలేదన్నారు. గురుకులాల్లో విద్యార్థులు చనిపోతే కనీసం పట్టించుకోలేదన్నారు. గురుకులాల కార్యదర్శిగా పనిచేసిన అధికారి.. పదవికి రాజీనామా చేశాక మీపై ఎన్నో ట్వీట్స్ చేశారని మంత్రి సీతక్క గుర్తుచేశారు.