అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల వయసు పరిమితి తగ్గించాల్సిన అవసరముందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఎన్‌సీఈఆర్‌టీలో విద్యార్థులు నిర్వహించిన అండర్-18 మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలంటే 25 ఏళ్లు నిండాలనే నిబంధన ఉందని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. ఓటు హక్కు పొందేందుకు వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారని తెలిపారు. అయితే.. ఎన్నికల్లో పోటీ చేయడానికి 25 ఏళ్ల వయసు ఉండాలనే రూల్‌ని మాత్రం సవరించలేదన్నారు. ఈ నిబంధనను కూడా సవరించుకుని.. 21 ఏళ్లు నిండిన యువత అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తద్వారా యువత చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
21 ఏళ్లు నిండిన యువత.. ఐఏఎస్, ఐపీఎస్‌లుగా సేవలు అందిస్తున్నప్పుడు.. 21 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఎమ్మెల్యేలుగా కూడా రాణిస్తారని తాను బలంగా నమ్ముతున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. మాక్ అసెంబ్లీ తర్వాత ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడకల సభలోనూ ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం పొందేలా చూడాలని.. సభలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు రేవంత్ రెడ్డి సూచించారు.
మరోవైపు.. రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని.. వాళ్లే తెలంగాణ భవిష్యత్ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. విద్యార్థులు వ్యసనాలకు బానిసలు కావొద్దని.. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటామని విద్యార్థులు ప్రమాణం చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు పూర్తయిందని.. ఇవాళ్టి నుంచే ప్రజా విజయోత్సవాలను ప్రారంభిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో విద్యార్థులు కూడా భాగస్వామ్యులు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.