తెలంగాణలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష కోసం టీజీపీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 9వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో జరగనుంది. గతంలో రెండు సార్లు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడంలో టీజీపీఎస్సీ విఫలం అయ్యింది. దీంతో ఈసారి ఎలాంటి పొరబాట్లు జరగకుండా పకడ్భందీగా నిర్వహించాలని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. 2022లో ఇచ్చిన గ్రూప్1 నోటిఫికేషన్ రద్దు చేసిన రేవతంత్ సర్కార్.. 563 ఉద్యోగాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్ష నిర్వహణలో లోపాల కారణంగా న్యాయవివాదాలు తలెత్తడంతో ప్రిలిమ్స్ రద్దయింది. ఈసారి మాత్రం ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు పాటించడంలో అభ్యర్థులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ నిర్ణయించింది.
ఓఎంఆర్ పద్ధతిలో ప్రిలిమ్స్..
4 లక్షలకుపైగా దరఖాస్తులు రావడంతో తొలుత ఆన్‌లైన్‌లో ఈ పరీక్ష నిర్వహించాలని భావించినప్పటికీ.. ఇంత మందికి ఆన్‌లైన్‌లో నిర్వహించడం సాధ్యంకాదని టీఎస్పీయస్సీ భావించింది. సీబీఆర్‌టీ విధానంలో అయితే సెషన్ల వారీగా పరీక్షలు నిర్వహించాల్సి రావడంతో.. ఒక్కరోజులోనే పరీక్షను పూర్తి చేసేందుకు ప్రిలిమ్స్‌ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు జూన్ 1 నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనుంది. ప్రిలిమ్స్ అనంతరం మెయిన్ పరీక్షలు అక్టోబరు 21న ప్రారంభంకానున్నాయి. మెయిన్ పరీక్షలు మొత్తం 7 పేపర్లకు జరుగుతాయి. ప్రిలిమినరీ పరీక్షలో జోన్లవారీగా పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో మెయన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రిజర్వుడ్ వర్గాలవారీగా 1:50 నిష్పత్తిలో తీసుకుంటారు. రిజర్వుడ్ వర్గాల్లో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఈ సందర్భంగా గ్రూప్ 1 అభ్యర్ధులకు ముఖ్య సూచనలు జారీ చేశారు.