ఇద్దరు బలవన్మరణం..
మరొకరు గుండెపోటుకు గురై..
వేర్వేరు ఘటనల్లో తీరని విషాదం
(హైదరాబాద్, మహా):
తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో వరుస ఆత్మహత్య ఘటనలు కలవరం రేపుతున్నాయి. తాజాగా మరో ముగ్గురు కానిస్టేబుళ్లు మృతి చెందారు. ఒకే రోజు వేర్వేరు ఘటనల్లో వీరు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు సూసైడ్ చేసుకోగా.. మరొకరు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి జిల్లాలో ముగ్గురు ఆత్మహత్య ఘటన మరవకముందే మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదాన్ని నింపింది.
కొల్చారంలో చెట్టుకు ఉరేసుకుని..
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. కొల్చారంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమీపంలో చెట్టుకు ఉరేసుకుని సాయి అనే కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. సాయి ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం విచారణ ప్రారంభించారు.
అప్పుల బాధ భరించలేక..
మరో ఘటనలో.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాలకుంట కాలనీలో బాలకృష్ణ అనే ఏఆర్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన భార్య మానస, ఇద్దరు పిల్లలు యశ్వంత్, ఆశిరిత్‌కు పురుగుల మందు ఇచ్చాడు. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ బాలకృష్ణ మరణించగా.. అతడి భార్య, పిల్లలు ఇద్దరూ హస్పిటల్‌లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అప్పుల బాధతోనే కానిస్టేబుల్ బాలకష్ణ ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు.
గుండెపోటుతో మరొకరు
భువనగిరికి చెందిన మరో హెడ్ కానిస్టేబుల్ దోసపాటి బాలరాజు గుండెపోటుతో మరణించాడు. శనివారం సాయంత్రం శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడ్డాడు. వెంటనే తోటి సిబ్బంది హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గ మధ్యంలోనే బాలరాజు మరణించాడు. అతడి మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇలా ఒక్కరోజే ముగ్గురు మరణించిన ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.