AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ ఆత్మ బంధువు మన్మోహన్ సింగ్‌.. భారత రత్న ఇవ్వాలి

– దేశానికి ఎనలేని సేవలు అందించారంటూ కొనియాడిన సీఎం

తెలంగాణ శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశం అయ్యింది. ఈనెల 26న కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు సభ సంతాపం తెలిపింది. సభ ప్రారంభం కాగానే సీఎం రేవంత్‌ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్‌ సింగ్‌ చేసిన సేవలను సీఎం రేవంత్‌ గుర్తుచేసుకున్నారు. ఆర్థిక సంస్కరణల రూపకల్పి మన్మోహన్‌ సింగ్‌ అని కొనియాడారు. దేశానికి ఆయన విశిష్ట సేవలు అందించారన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలని రేవంత్‌ అన్నారు.

దేశానికి విశిష్ట సేవలు..
‘మన్మోహన్‌ సింగ్‌ దేశానికి విశిష్ట సేవలందించారు. కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, ఆర్బీఐ గవర్నర్‌గా, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్‌ గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా సేవలందించారు. ప్రధానిగా పదేళ్లు అద్భుతమైన పాలన అందించారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. తెలంగాణ రాష్ట్రానికి మన్మోహన్‌ ఆత్మబంధువు. తెలంగాణతో ఆయన బంధం విడదీయరానిది. రాష్ట్రహోదా కల్పించిన మానవతావాది. తెలంగాణ ప్రజల గుండెల్లో మన్మోహన్‌ స్థానం శాశ్వతం. ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించాలి’ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదారు..
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ప్రకటించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి విపక్ష బీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపింది. సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… మన్మోహన్‌ సింగ్‌ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదారని ప్రశంసించారు. 1991–96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధిబాట పట్టించారని కొనియాడారు.

సంస్కరణల రూపశిల్పి..
దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని, వరుసగా రెండు పర్యాయాలు ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్‌గా ఎనలేని సేవలు అందించారని రేవంత్‌ గుర్తుచేశారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌ గా పనిచేశారని చెప్పారు. దేశానికి విశిష్ట సేవలు అందించారని సీఎం రేవంత్‌ రెడ్డి గుర్తుచేశారు.

విపక్షనేత, మాజీ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి బీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తోందని ప్రకటించారు. దేశ అత్యున్నత పౌరపురస్కారానికి మన్మోహన్‌ సింగ్‌ పూర్తి అర్హులు అని పేర్కొన్నారు.

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10