తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చింది. కొత్త తెలంగాణ తల్లి విగ్రహ రూపానికి సంబంధించిన నమూనాను విడుదల చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి బిన్నంగా కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. ఎడమ చేతిలో బతుకమ్మ, కుడి చేతిలో కంకి, జొన్నలు, వరి.. మేడలో బంగారు ఆభరణాలు, తలకు కిరీటం, నడుముకు వడ్డాణంతో గత తెలంగాణ తల్లి విగ్రహం ఉండేది.
తాజాగా కాంగ్రెస్ సర్కార్ రూపొందించిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మతో పాటు కిరీటం, నడుముకు ఉన్న వడ్డాణం మాయం అయ్యాయి. తెలంగాణలో గ్రామాల్లో మహిళల కట్టుబొట్టు ప్రతిబింబించేలా కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించింది. ఈ నెల 9న రేవంత్ సర్కార్ అధికారికంగా సచివాలయంలో కొత్త తెలంగాణ రూపాన్ని ఆవిష్కరించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ హాజరై.. కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
తెలంగాణ తల్లి విగ్రహంపై నాటి నుంచి నేటి వరకు అనేక వివాదాస్పద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ తన కూతురు ఎమ్మెల్సీ కవిత లాగా మొహం ఉండేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారని కాంగ్రెస్, బీజేపీ పార్టీలో విమర్శలు గుప్పించాయి. తాము అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తామని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీలువ్యాఖ్యలు చేశాయి. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం నూతన తెలంగాణ తల్లి రూపంపై కార్యాచరణ సిద్ధం చేసింది. తాజాగా కొత్త రూపంలో ఉన్న తెలంగాణ తల్లి నమూనాను విడుదల చేసింది. అయితే.. దీనిపై కూడా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.