పార్టీలు మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోకుండా, తీర్మానాల్లో ఓటు వేయకుండా ఆదేశించాలని తన పిటిషన్ లో పాల్ కోరారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు పార్టీలు మారితే ప్రజల్లో నమ్మకం పోతుందని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే పార్టీలు మారడం సహజమైపోతుందని తెలిపారు.
ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు… పిటిషన్ ను కొట్టివేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ పరిధిలో ఉందని హైకోర్టు తెలిపింది. ఈ అంశంపై తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఇటీవల వెలువరించిన తీర్పులో పేర్కొన్నామని చెప్పింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకముందే సదరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించలేమని స్పష్టం చేసింది.