– దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత మృతికి సంతాపం
– లాస్య తండ్రి సాయన్నతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం
– వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన రేవంత్
– తెలంగాణ బడ్జెట్ సమావేశాలు షురూ..
– సభ రేపటికి వాయిదా వేసిన స్పీకర్
(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య సాయన్నకు సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. ఇలాంటి తీర్మానం ప్రవేశ పెట్టడం బాధగా ఉందన్నారు. లాస్య నందిత తండ్రి సాయన్న తనకు అత్యంత సన్నిహితులన్నారు. చాలా ఏళ్లగా ఇద్దరు కలిసి పని చేశామని గుర్తుచేశారు. సాయన్న కంటోన్మెంట్ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన మరణించారన్నారు.
ప్రజల మనసుల్లో శాశ్వతం..
తండ్రి వారసత్వాన్ని తీసుకుని లాస్య ప్రజాజీవితంలోకి వచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కంటోన్మెంట్ ప్రజల తరపున పోరాడుతారని భావించామని, దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారని వివరించారు. కంటోన్మెంట్ ప్రజల మనసుల్లో శాశ్వతంగా సాయన్న, లాస్య నిలిచి పోతారన్నారు. వారు చేయాలనుకున్న పనులను ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. లాస్య మృతికి సంతాపం తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి, వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలిపారు.
స్పీకర్ సంతాపం..
కంటోన్మెంట్ దివంగత మాజీ ఎమ్మెల్యే లాస్యా నందితకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సంతాపం తెలిపారు. ఆయన ఆదేశాలలో సభలో సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సమావేశా లను బుధవారం నాటికి వాయిదా వేశారు స్పీకర్.
కాంగ్రెస్‌లో చేరిన వారంతా..
ఇక బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. వారంతా అసెంబ్లీలో వెనుక సీట్లలో కూర్చుండి పోయారు. ఆ ఎమ్మెల్యేల్లో పోచారం, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య ఉన్నారు. ఏ పార్టీ కండువా కప్పుకోకుండా వచ్చి సదరు ఎమ్మెల్యేలు వెనుక వరుసలో కూర్చోవడం కనిపించింది.