తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈనెల 25న ఉభయ సభల్లో తెలంగాణ సర్కార్ (Telangana Govt) బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. సభలో పైచేయి సాధించాలని కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. తాము చేసిన అభివృద్ధి, తీసుకున్న నిర్ణయాలు అసెంబ్లీ వేదికగా చెప్పాలని హస్తం నేతలు భావిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Former CM KCR) సభకి వస్తే ప్లాన్ ఏ, కేసీఆర్ సభకి రాకపోతే ప్లాన్ బీ అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ పదేండ్లలో చేయాలేని పనిని తమ ప్రభుత్వం ఏడు నెలల్లోనే చేసి చూపించిందని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చెప్పే ప్రయత్నం చేయనున్నారు. మరోవైపు అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యా బలం పెరిగింది. కాంగ్రెస్ నుంచి 64 ఎమ్మెల్యేలు గెలుపొందిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి అదనంగా మరో 10 ఎమ్మెల్యే బలం వచ్చిచేరింది. అలాగే కాంగ్రెస్ కొత్త ఎమ్మేల్యే శ్రీ గణేష్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ గెలిచారు. కాగా.. ఈరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభం అవనుండగా.. రేపటి నుంచి శాసనమండలి సమావేశాలు మొదలుకానున్నాయి. ఇటు మండలిలోనూ కాంగ్రెస్ పార్టీకి అదనంగా మరో ఆరుగురు ఎమ్మెల్సీలు వచ్చి చేరారు.
ప్రభుత్వాన్ని నిలదీయనున్న బీఆర్‌ఎస్
మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు. ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 గంటలకు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ హాజరు కానున్నారు. సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజు అసెంబ్లీకి హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేవలం ఒక్కరోజు మాత్రమే కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది.