సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్దిసేటికే శంషాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ సాంకేతిక సమస్య కారణంగా రేవంత్ ముంబై ప్రయాణం దాదాపు గంటన్నర ఆలస్యమైనట్లు తెలుస్తోంది. కాగా ఇదే విమానంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ ఉన్నారు.
ముంబైలో ఆదివారం జరగనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగింపు సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముంబైకి బయలుదేరారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా ఇంజిన్ వేడెక్కడం గమనించిన పైలట్ వెంటనే విమానాన్ని ల్యాండ్ చేశారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చాలాసేపటి దాకా విమానాశ్రయంలోనే ఎదురుచూడాల్సి వచ్చింది. కాగా, దాదాపు గంటన్నర తర్వాత మరమ్మతులు పూర్తవ్వడంతో ఇండిగో విమానం బయలుదేరి ముంబై వెళ్లింది.