టీడీపీలో టికెట్ల అసమ్మతి ఇంకా సమసిపోలేదు. అధినేత చంద్రబాబు తుది జాబితా ప్రకటించిన దగ్గర నుంచి ఆ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో నేతలు పార్టీ అధినేతను నిలదీస్తున్నారు. ఈ దఫా టీడీపీ సీనియర్లకు సైతం టికెట్ దక్కకపోవడం సంచలనంగా మారింది. జనసేన, బీజేపీ పార్టీలతో పొత్తు వల్ల టీడీపీలో చాలామందికి టికెట్లను కేటాయించలేకపోయారు. దీనిపై నేతలు బహిరంగంగానే చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా టికెట్ రాకపోవడంతో టీడీపీ నేత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అరకు టీడీపీ ఇంచార్జ్ సివేరి దొన్నుదొర ఆత్మహత్యాయత్నం చేసుకోవాలని ప్రయత్నించారు. అరకు అసెంబ్లీ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. అయితే చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో దొన్నుదొర ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై దొన్నుదొర మాట్లాడుతూ.. నేను, నా భార్య, కుమారుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందరం కలిసి ఈ జీవితం ఇక చాలని అనుకున్నాం. అయితే చివరి క్షణంలో ఈ ఆలోచనను విరమించుకున్నామని ఆయన తెలిపారు. నేను చనిపోతే నాపై నమ్మకం పెట్టుకున్న ప్రజలు, కార్యకర్తలు ఏమైపోతారని ఆలోచించాం. కార్యకర్తల భవిష్యత్తు గురించి ఆలోచించి విరమించుకొన్నా అని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ కోసం కోట్ల రూపాయలు అప్పులు చేసి కార్యక్రమాలు నిర్వహించానని ..పార్టీ బలోపేతానికి చాలా కృషి చేశానన్నారు. ఇప్పుడు సీటు తనకు కాకుండా వేరే వారికి కేటాయింయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పార్టీ వల్ల తీవ్ర అప్పుల్లో కూరుకుపోయానని ఇప్పుడు దీని నుంచి మమ్మల్ని ఎవరు కాపాడతారని దొన్నుదొర ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఎవరు ఆదరిస్తే వారికే మద్దతు ఇస్తాం. లేదంటే ఇండిపెండెంట్‌గా పొటీలో ఉంటా అని దొన్నుదొర కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అరకు టికెట్‌ను బీజేపీకి ఇవ్వడాన్ని నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు.బీజేపీ రాజారావు వద్దు దొన్నుదొర ముద్దు అంటూ నినాదాలు చేశారు. పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి హామీ దక్కకపోతే దొన్నుదొర నాలుగు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.