AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆశ్చర్యం.. 56 ఏళ్లుగా గర్భంతో మహిళ.. 81 ఏళ్ల వయసులో పిండం తొలగింపు..!

సాధారణంగా గర్భిణులు 9 నెలలపాటు పిండాన్ని మోస్తారు. ఆ తర్వాత బిడ్డకు జన్మనిస్తారు. కానీ బ్రెజిల్‌కు చెందిన ఓ 81 ఏళ్ల మహిళ దాదాపు 56 ఏళ్లుగా గర్భంతో ఉంది. ఆమె గర్భం దాల్చిన సంగతి ఆమెకే తెలియలేదు. ఇటీవల ఓ రోజు కడుపు నొప్పి రావడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లగా విషయం బయటపడింది. దాంతో డాక్టర్లే షాకయ్యారు. ఈ వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

బ్రెజిల్‌ మీడియా కథనాల ప్రకారం.. ఆ దేశానికి చెందిన డానియెలా వెరా అనే మహిళ 56 ఏండ్ల క్రితం గర్భం దాల్చింది. కానీ ఆమెకు 81 ఏళ్ల వయసొచ్చినా ప్రసవించలేదు. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆమె కడుపులో పిండం అలాగే ఉండిపోయింది. చాలా ఏళ్ల క్రితమే మృతి చెందిన పిండం కడుపులో అలాగే గడ్డకట్టుకుపోయింది. కానీ ఆమెలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు. దాంతో ఆమె ఈ విషయాన్ని గుర్తించలేకపోయింది.

ఇటీవల ఆమె పరాగ్వా సరిహద్దు మీదుగా స్వదేశానికి వస్తుండగా కడుపులో నొప్పి మొదలైంది. వెంటనే వైద్యులను సంప్రదించిన ఆమెకు కడుపులో పిండం ఉన్నట్టు తేలింది. స్కానింగ్‌ ఫిల్మ్‌లో బాధితురాలి కడుపులో పిండం కనిపించడంతో వైద్యులు షాకయ్యారు. వైద్యుల ద్వారా విషయం తెలుసుకుని డానియెలా కూడా షాకయ్యింది. ఆ పిండం మరణించి దాదాపు 56 ఏళ్లయ్యిందని వైద్య నిపుణుల పరిశీలనలో తేలింది.

వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి రీత్యా వైద్యులు మార్చి 15న ఆపరేషన్ చేసి మృత పిండాన్ని వెలికితీశారు. ఆ తర్వాత మహిళ ఇన్‌ఫెక్షన్‌ బారినపడి ఇటీవలే మృతిచెందింది. కాగా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (Ectopic pregnancy) కలిగిన సందర్భాల్లో ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. గర్భసంచి బయట పిండం పెరిగితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారని చెప్పారు. ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ వల్ల పిండం ఎక్కువ కాలం మనలేక మరణించడంతో ఇలా జరుగుతుందన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10