AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజస్థాన్‌ను చిత్తుచేసి ఫైనల్‌ చేరిన సన్‌రైజర్స్‌..

ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫైనల్‌ చేరింది. తొలి క్వాలిఫయర్‌లో కేకేఆర్‌ చేతిలో భంగపాటుకు గురైన ఎస్‌ఆర్‌హెచ్‌.. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓడించింది. దీంతో ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది. ఈ ఫలితంతో రాజస్థాన్‌ రాయల్స్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 175/9 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్‌ను 139/7 పరుగులకు పరిమితం చేసింది.

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ మెరుపు ఆరంభం ఇచ్చాడు. 21 బంతుల్లో 42 రన్స్‌ చేశాడు. దీంతో 7.4 ఓవర్లలో రాజస్థాన్‌ 65/1తో మెరుగైన స్థానంలో నిలిచింది. ఈ దశలో సన్‌రైజర్స్‌ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. కట్టుదిట్టంగా బంతులేస్తూ వరుస ఓవర్లలో వికెట్లు తీశారు. దీంతో 15 పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయింది. టామ్‌ కోహ్లర్‌ కాడ్మోర్‌ (10), సంజూ శాంసన్‌ (10), రియాన్ పరాగ్‌ (6), రవిచంద్రన్‌ అశ్విన్ (0), షిమ్రాన్‌ హిట్‌మెయర్‌ (4), రోవ్‌మన్‌ పోవెల్‌ (6) విఫలమయ్యారు.

ఓ వైపు వికెట్లు పడుతున్నా.. యువ వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ గొప్పగా పోరాడాడు. అయినా సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోవడంతో రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. చివరకు రాజస్థాన్ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 139/7 పరుగులకు పరిమితమైంది. ధ్రువ్‌ జురెల్‌ 35 బంతుల్లో 56 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ షాబాజ్‌ అహ్మద్‌ 3, అభిషేక్‌ శర్మ 2, ప్యాట్‌ కమిన్స్‌ 1, నటరాజన్‌ 1 వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 175/9 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో హన్రిచ్‌ క్లాసెన్‌ 34 బంతుల్లో 54 రన్స్‌ చేసి జట్టును ఆదుకున్నాడు. రాహుల్‌ త్రిపాఠి 15 బంతుల్లో 37 రన్స్‌, ట్రావిస్‌ హెడ్‌ 28 బంతుల్లో 34 రన్స్‌ చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్‌ బౌల్ట్ 3, ఆవేశ్‌ ఖాన్‌ 3, సందీప్ శర్మ 2 వికెట్లు తీశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10