ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఉత్తర వజీరిస్థాన్‌లోని గిరిజన జిల్లాలో శనివారం (మార్చి 16)న ఉగ్రదాడి జరిగింది. ఆరుగురు ఉగ్రవాదులు భద్రతా చెక్‌పోస్టుపై పలు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. పలుచోట్ల జరిగిన ఆత్మాహుతి దాడుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులతో సహా కనీసం ఏడుగురు పాకిస్తాన్ ఆర్మీ సైనికులు మరణించారని మిలటరీ తెలిపింది. ఐదుగురు సైనికులతో పాటు ఒక లెఫ్టినెంట్ కల్నల్, ఒక కెప్టెన్ మరణించారు. మీర్ అలీ ప్రాంతంలోని చెక్‌పోస్టుపై దాడి చేసిన 6 ఉగ్రవాదులను పాక్ ఆర్మీ మట్టుబట్టింది.
ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చిన పాక్ ఆర్మీ :
ఐఎస్‌పీఆర్ ప్రకటన ప్రకారం.. దళాలు చొరబాటు విఫలమైన తర్వాత ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని పోస్ట్‌లో ఢీకొట్టారు. ఆ తర్వాత అనేక ఆత్మాహుతి బాంబు దాడులకు పాల్పడ్డారు. ఆ తర్వాత క్లియరెన్స్ ఆపరేషన్ సమయంలో పాక్ ఆర్మీ దళాలు సమర్థవంతంగా మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చాయి.
అయితే, తీవ్రమైన ఎదురుకాల్పుల్లో, లెఫ్టినెంట్ కల్నల్ సయ్యద్ కాషిఫ్ అలీ, కెప్టెన్ ముహమ్మద్ అహ్మద్ బదర్ మరణించినట్లు పాక్ ఆర్మీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ ప్రాంతంలో ఉన్న ఇతర ఉగ్రవాదులను అంతమొందించేందుకు శానిటైజేషన్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు మిలటరీ మీడియా విభాగం తెలిపింది.