AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఐటీఐలో సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి.. ముఖ్యమంత్రి ఆదేశాలు

మార్కెట్ అవ‌స‌రాల‌కు అనుగుణ‌మైన కోర్సుల‌ను ఐటీఐ ప్రారంభించాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా కోర్సుల‌కు అవ‌స‌ర‌మైన సిల‌బ‌స్ రూప‌క‌ల్పన‌కు ఓ క‌మిటీని నియ‌మించి, నిపుణులు, విద్యావేత్తల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించాల‌ని ఆదేశించారు. కార్మిక‌, ఉపాధి క‌ల్పన శాఖ అధికారుల‌తో రాష్ట్ర సచివాల‌యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ‌నివారం స‌మీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా మార్చుతున్న నేపథ్యంలో ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రతి ఐటీఐ క‌ళాశాలల‌కు ప్రిన్సిపాళ్లు ఉండేలా చూడాల‌ని, శిక్షణ తీసుకుంటున్న వారికి స‌మ‌గ్రమైన శిక్షణ అందేలా జాగ్రత్త ప‌డాల‌ని సూచించారు. ఐటీఐ క‌ళాశాల‌ల ప‌ర్యవేక్షణ‌, త‌నిఖీలు క్రమం త‌ప్పకుండా చేప‌ట్టాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల్లోనూ కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో ఐటీఐ/ ఏటీసీ లేని శాస‌న‌స‌భ‌ నియోజకవర్గాలను గుర్తించి నివేదిక‌ సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. హైద‌రాబాద్ న‌గ‌రం మిన‌హా 100 నియోజకవర్గాల్లో ఐటీఐ/ఏటీసీలు ఉండేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌న్నారు. వృత్తి నైపుణ్యం అందించే ఐటీఐ/ఏటీసీ, పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల‌ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధివిధానాలు రూపొందించాలని రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10