బాలీవుడ్ దివంగత నటి శ్రీదేవి సినీ ఇండస్ట్రీలో సౌత్ నుంచి నార్త్ దాకా చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ లాంటి బాషల్లో నటించి తిరుగులేని స్టార్‌గా ఎదిగింది. ఆమె కెరీర్‌లో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించింది. వాటిలో చాలావరకు సూపర్ హిట్స్‌గా నిలిచి సినిమా ఇండస్ట్రిలో ఆమెను అతిలోక సుందరిగా నిలిపాయి. ఇదిలా ఉండగా శ్రీదేవికి అరుదైన ఘనతను అందుకుంది. ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఉన్న లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని ఒక జంక్షన్‌కి అక్కడి ప్రజలు శ్రీదేవి కపూర్ చౌక్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. శ్రీదేవి, బోనీ కపూర్‌తో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషి కపూర్‌లు ఇంతకుముందు ఇదే ప్రాంతంలో నివసించారు అని.. శ్రీదేవి మరణించిన అనంతరం షిప్ట్ అయ్యారని స్థానిక ప్రజలు తెలిపారు. దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవిని ఇప్పటికీ అభిమానుల గుండెల్లో ప్రత్యేకంగా గుడి కట్టుకుని ఆరాధిస్తున్నారు.