త్వరలోనే గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల చేవేళ్లలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. ఒక్కో గ్రామంలో ఐదుగురు సభ్యులతో ఇందిరమ్మ కమిటీలు వేస్తామన్నారు రేవంత్. ఇందిరమ్మ కమిటీల ద్వారానే సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించనున్నారు. ఇప్పటికే పది జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమించామన్నారు రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఐదుగురు సభ్యులను సెలక్ట్ చేసి ఆ లిస్టును ఇన్‌ఛార్జి మంత్రులకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు.
ఇకపై ఏ పథకమైనా ఇందిరమ్మ కమిటీల చేతుల మీదుగానే అమలు చేస్తామన్నారు. ఇందిరమ్మ కమిటీలో అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో కార్యకర్తల శ్రమ, రక్తం ఉందని.. వాళ్ల రుణం తీర్చుకుంటామన్నారు రేవంత్. ఎంపీలను గెలిపించడంతోనే తమ బాధ్యత తీరిపోదని, పార్టీ జెండా మోసిన వారికి న్యాయం చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ అభయహస్తం హామీలను ఇంటింటికీ కార్యకర్తలు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.