AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాళేశ్వరం కమిషన్‌ ఎదుట స్మితా సబర్వాల్‌ నిజాలు..!.. బీఆర్‌ఎస్‌ అధినేతకు బిగ్‌ షాక్‌..

‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులకు సంబంధించి నాకు తెలియదు.. అవగాహన లేదు.. అంతా కేసీఆర్‌ కనుసన్నల్లోనే జరిగింది..’ అని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌ కమిషన్‌ ఎదుట వెల్లడించినట్లు సమాచారం. జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ ఆధ్వర్యంలోని కాళేశ్వరం కమిషన్‌ బహిరంగ విచారణ  కొనసాగింది. ఈ మేరకు కమిషన్‌ ఎదుట మాజీ సీఎస్‌ సోమేశ్‌కుమార్, అప్పట్లో సీఎంఓలో సెక్రటరీగా విధులు నిర్వర్తించిన ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ హాజరయ్యారు. విచారణలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులకు సంబంధించి కమిషన్‌ చైర్మన్‌ పినాకీ చంద్రఘోష్‌ వారిని క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసినట్లు సమాచారం. కేబినెట్‌ ఆమోదం లేకుండానే 3 బ్యారేజీలకు పరిపాలన అనుమతులు ఇచ్చారా? అని స్మితా సబర్వాల్‌ను కమిషన్‌ ప్రశ్నించించింది. కమిషన్‌ అడిగిన ప్రశ్నలకు ‘నాకు తెలియదు, అవగాహన లేదు’ అని స్మితా సబర్వాల్‌ సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సీఎంఓకి వచ్చే ప్రతి ఫైల్‌కు సీఎం ఆమోదం ఉంటుందని, సీఎంఓలో తాను ఏడు శాఖలను చూసినట్లు స్మితా సబర్వాల్‌ వెల్లడించారు. చెప్పారు. మై రోల్‌ ఈజ్‌ లిమిటెడ్‌.. జనరల్‌ కో–ఆర్డినేషన్‌ మాత్రమే అని కమిషన్‌ ఆమె వివరించారని సమాచారం. దీంతో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు బిగ్‌షాక్‌ ఇచ్చారన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.

సోమేశ్‌కుమార్‌పై ఆగ్రహం..
మరోవైపు మాజీ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌పై కాళేశ్వరం కమిషన్‌ చీఫ్‌ జస్టిస్‌ చంద్రఘోష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ విచారణ కోర్టు హాల్లోకి పిలిచిన వెంటనే రాకపోవడంతో సోమేశ్‌ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో స్మితా సబర్వాల్‌ సీఎంఓలో కీలకంగా వ్యవహరించగా, సోమేశ్‌ కుమార్‌ సీఎస్‌గా విధులు నిర్వర్తించారు.

ఎస్కే జోషి సైతం..
కాగా, బుధవారం మాజీ సీఎస్‌ ఎస్కే జోషి, మాజీ ఐఏఎస్‌ రజత్‌ కుమార్‌ విచారణను ఎదుర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కు సంబంధించి మేడిగడ్డ , అన్నారం , సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల విషయంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంది మాజీ సీఎం కేసీఆర్, అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు అని మాజీ సీఎస్‌ ఎస్కే జోషి కమిషన్‌కు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన వ్యాప్కోస్, సీఈ–సీడీవో, ఇంజనీర్లతో జరిగిన సమావేశంలో వారే ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. 2016 మే 2న మేడిగడ్డ వద్ద భూమి పూజ చేసి బ్యారేజీల నిర్మాణాలను కేసీఆర్‌ ప్రారంభించారని తెలిపారు. అదే రోజు ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్ట్‌ పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చేశారని కమిషన్‌కు వివరించారు.

నిర్ణయం తీసుకున్నది వారిద్దరే..
కాగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలని నిర్ణయం తీసుకున్నది మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులేనని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శైలేంద్రకుమార్‌ జోషి బుధవారం తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌కు గత ప్రభుత్వం నిర్ణయించిందని.. దాంట్లో భాగంగానే మేడిగడ్డపైనా నిర్ణయం తీసుకుందని కమిషన్‌కు వివరించారు. విచారణ సందర్బంగా జోషికి కమిషన్‌ ప్రశ్నలు వేసింది.

బ్యారేజీల నిర్మాణానికి కారణం..
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టడానికి కారణం ఏంటని కమిషన్‌ ప్రశ్నించగా తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్‌ చేశారని, అప్పటికి బ్యారేజీ తప్ప ఇతర కాంపోనెంట్ల పరంగా 7.7 శాతం పనులు జరిగాయని శైలేంద్రకుమార్‌ జోషి అన్నారు. మహారాష్ట్ర అభ్యంతరాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రంతో మేడిగడ్డ నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కేంద్ర జలవనరుల సంఘం కూడా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని, ఆఫ్‌లైన్‌, అన్‌ లైన్‌ రిజర్వాయర్ల నీటి సామర్థ్యం పెరగాలని చెప్పిందని ఆయన సమాధానం ఇచ్చారు. బ్యారేజీలు అక్కడే కట్టాలనే నిర్ణయాలు ఎవరివి అనే ప్రశ్నకు అప్పటి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో వ్యాప్కోస్‌ కమిటీ, సీఈ, సీడీవో, ఇంజనీర్లతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని శైలేంద్రకుమార్‌ జోషి వెల్లడించారు, సబ్‌కమిటీ వేయలేదని, 2016 మే 2న మేడిగడ్డ బ్యారేజీ వద్ద కేసీఆర్‌ భూమి పూజ చేసి, మూడు బ్యారేజీల నిర్మాణం ప్రారంభించారని, అదే రోజు ప్రాణహిత చేవెళ్ల పేరు మార్చారని తెలిపారు.

విధానపరమైన నిర్ణయం తీసుకున్నారా?
బ్యారేజీల నిర్మాణంపై విధానపరమైన నిర్ణయం తీసుకున్నారా.. ప్రభుత్వం అంటే ఏమిటని కమిషన్‌ ప్రశ్నించింది. అప్పటి మంత్రివర్గం, సీఎం కేసీఆర్‌ విధానపరమైన నిర్ణయం తీసుకున్నారని, సీఎం కన్నా మంత్రివర్గమే బలమైనదని.. అయితే సీఎంను ఎవరైనా మంత్రి వ్యతిరేకించినా, అసమ్మతి తెలిపినా ఆ మరుసటి రోజే మంత్రివర్గం నుంచి ఉద్వాసన ఉంటుందని శైలేంద్రకుమార్‌ జోషి వెల్లడించారు.

అనుమతులున్నాయా?
స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ (ఎస్‌ఎల్‌ఎస్సీ) లక్ష్యాలు, విధులు, బాధ్యతలు ఏమిటి.. కాళేశ్వరం ప్రాజెక్టుకు పరిపాలన పరమైన అనుమతులన్నీ ఉన్నాయా.. అని కమిషన్‌ ప్రశ్నించగా.. వివిధ ఇంజనీరింగ్‌ శాఖలకు చెందిన ఐదుగురు చీఫ్‌ ఇంజనీర్లతో ఎస్‌ఎల్‌ఎస్‌సీ ఉంటుందని శైలేంద్రకుమార్‌ జోషి తెలిపారు. ఒక ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాల ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ కమిటీ చర్చించి, లోపాలుంటే వాటిని సవరించాలని సూచిస్తుందన్నారు. అన్నీ సరిగా ఉంటే ఆ ప్రతిపాదనలకు పరిపాలనపరమైన అనుమతి ఇవ్వవచ్చని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు 28 ప్యాకేజీలు, 8 లింకులుగా ఉందని వెల్లడించారు. గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా ప్రాజెక్టులో మార్పులు చేశామన్నారు. చీఫ్‌ ఇంజనీర్‌ ఎస్‌ఎల్‌ఎస్‌సీకి ప్రతిపాదనలు పంపిస్తే… ఆ తర్వాత ప్రభుత్వానికి చేరిన తర్వాత దాదాపు 200లకుపైగా పనులకు విడివిడిగా పరిపాలనపరమైన అనుమతులు ఇచ్చామని జోషి వివరించారు. మేడిగడ్డ నిర్మాణ బాధ్యతలు తీసుకున్న సంస్థ కొన్ని బ్లాకులను వేరే సంస్థతో కట్టించిందా అనే ప్రశ్నకు మాత్రం.. ఆ సమాచారం తనకు తెలియదని శైలేంద్రకుమార్‌ జోషి సమాధానం ఇచ్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10