AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దసరా నుంచే స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం: సీఎస్ శాంతి కుమారి

రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనిర్సిటీలో పలు కోర్సులను దసరా పండుగ నుంచి ప్రారంభిస్తున్నట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. ఈ యూనివర్సిటీలో దాదాపు 20 కోర్సులు నిర్వహించనున్నామని.. వీటిలో ఆరు కోర్సులు దసరా నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. శనివారం ఆమె అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ” ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో ఈ స్కిల్ యూనివర్సిటీ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణ పనులు ముగిసేవరకు ఈ యూనివర్సిటీని తాత్కాలిక భవనంలో నడిపిస్తారు. ఇప్పటికే వర్సిటీ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను, కో-ఛైర్మన్‌ శ్రీనివాస సి.రాజును నియమించడం జరిగింది. 

ఈ యూనివర్సిటీలో దాదాపు 140 కంపెనీలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయి. దాదాపు 20 కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించారు. తొలుత స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలో సర్టిఫికెట్ కోర్స్‌లు, డిప్లొమా కోర్సులను ప్రారంభించనున్నాం. వివిధ విభాగాల్లో శిక్షణ నిమిత్తం దేశంలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన SBI, NAC , Dr. Reddy’s ,TVAGA , ADAANI, CII లు భాగస్వాములుగా ఉండేందుకు ముందుకు వచ్చాయని” శాంతి కుమారి అన్నారు. అలాగే ఈ వర్సిటీకి సంబంధించిన లోగోను, వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందులో కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఆకర్షణీయమైన వేతనంతో కూడిన ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10