ఐఏఎస్ అధికారులు బాధ్యతగా ఉండాలంటూ హితవు
(అమ్మన్యూస్,హైదరాబాద్):
సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ఆర్థిక సంఘం కార్యదర్శి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచీ ఆగ్రహాజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఆల్ ఇండియా సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఎందుకు అంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క సైతం ఫైర్ అయ్యారు. ఐఏఎస్ అధికారులు బాధ్యతగా ఉండాలని స్మితా సబర్వాల్ కు సూచించారు.
ఉన్నతాధికారి హోదాలో ఉండి, దివ్యాంగులపై ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. వైకల్యాన్ని కించపరచవద్దని చెప్పారు. ఆమె క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో… దివ్యాంగులపై స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై సీనియర్ టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి కేఎస్ జవహార్ స్పందించారు. ఇందులో భాగంగా ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇలాంటి వారు ప్రభుత్వ పదవుల్లో కొనసాగే అర్హత లేదని వ్యాఖ్యానిస్తూ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.