సమస్యలు పరిష్కరించాలంటూ మాజీ సీఎం చిత్రపటానికి వినతి
(అమ్మన్యూస్, సిద్దిపేట జిల్లా):
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్ గా ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్ కాంగ్రెస్ నేతలు వరుస నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోమవారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. గజ్వేల్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని, అలాగే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని కేసీఆర్ చిత్రపటానికి వినతి పత్రాన్ని అందజేశారు. నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కార్యాలయం గోడకు వినతి పత్రాన్ని అంటించారు. ఇప్పటికే గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదని ఎక్కడున్నా వెతకాలంటూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు కార్యకర్తలతో కలిసి గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ ఎమ్మెల్యే ఎక్కడున్నా వెతికి పట్టుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రతిపక్ష నాయకుడిగా సేవలు అందించాలి..
ఈ సందర్భంగా శ్రీకాంత్ రావు మాట్లాడుతూ.. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. ప్రస్తుతం గజ్వేల్ ప్రజలకు సేవలు అందించాలన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో జరిగే చర్చల్లో పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పోలీసులు పది రోజుల్లో ఆచూకీ తెలపకపోతే.. తామే ఆయన కోసం గాలింపు చర్యలు చేడతామని శ్రీకాంత్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, నక్క రాములు గౌడ్, తోపాటుపెద్ద ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నాయి.
నగరంలోనూ పోస్టర్లు..
కాగా, గత సెప్టెంబర్ నెలలో భారీ వర్షాలు కురిసిన సమయంలో హైదరాబాద్ నగరంలో కేసీఆర్ కనబడటం లేదంటూ పలు పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో కష్టాలు పడుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ పత్తా లేడు అంటూ సదరు పోస్టర్లలో పేర్కొన్నారు.