(అమ్మన్యూస్, హైదరాబాద్):
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో శాసన సభ్యుడిగా ప్రమాణ చేశారు. శ్రీ గణేష్‌తో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం శ్రీ గణేష్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతితో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన పెద్ద కుమార్తె లాస్య నందిత బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి గెలిచింది. కాగా, కొన్ని నెలలకే సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి దివంగత మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూతురు నివేదితపై 9,725 ఓట్లతో శ్రీ గణేష్ విజయం సాధించిన విషయం తెలిసిందే.