కడప జిల్లా వల్లూరు మండలం అంబవరం గ్రామం దగ్గర భాష్యం విద్యాసంస్థలకు చెందిన స్కూల్ వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. బస్సు బోల్తా పడ్డ సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. ఆరుగురికి గాయాలు కావడంతో వల్లూరు, చింతకొమ్మదిన్నె మండలాలకు చెందిన108 వాహనాలలో కడప రిమ్స్‌కు తరలించారు. కడప నుండి అంబవరం గ్రామానికి సింగల్ రోడ్డు కావడం అందులోను రోడ్డు గతుకులమయంగా ఉన్న కారణంగా బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్టు స్థానికులు తెలిపారు. స్కూలు అయిపోయిన తర్వాత విద్యార్థులను ఇంటికి తీసుకు వెళుతున్న సమయంలో పూర్తిగా రోడ్డుకు ఒకవైపు ప్రయాణించడంతో బస్సు ఒకవైపుకు ఒరిగింది. పంట కాలువలకు తీసిన చిన్న కాలువ ఉండటం అది కూడా ఎండిపోయి ఉండటంతో విద్యార్థులకు ఎటువంటి ప్రమాదము జరగలేదు.
అంతేకాక బస్సు కూడా ఒక్కసారే బోల్తా కొట్టకుండా స్లోగా పక్కకు ఒరిగి బోల్తా కొట్టడంతో విద్యార్థులకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. విద్యార్థులు దిగవలసిన డోర్ నేలకు అనుకొని ఉండడంతో బస్సు వెనుక భాగాన ఉన్న అత్యవసర ద్వారం నుంచి వారు బయటకు వచ్చారు. ఆ సమయంలో 25 మంది విద్యార్థులు ఉండడం వలన ప్రమాదం తీవ్రంగా జరిగి ఉంటుంది అనుకున్నారు. కానీ బస్సు స్లోగా పక్కకు ఒరగటం.. ఆ తరువాత కింద పడడంతో ప్రమాద తీవ్రత పెద్దగా లేకుండా స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులందరూ సురక్షితంగా బయటకు వచ్చారు. ఇదే కొంచెం వేగంగా బస్సు నడిపి ఉంటే.. తీవ్రమైన ప్రాణాపాయం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు. ఏది ఏమైనా స్కూల్ బస్సు నడిపే డ్రైవర్లు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఆచితూచి వెళ్లడం చాలా మంచిది. లేదంటే తల్లిదండ్రులకు శోకం తప్పదు. ముఖ్యంగా ప్రైవేటు స్కూలు వాహనాల విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలను అరచేతిలో పెట్టి స్కూలుకు పంపించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రమాద తీవ్రత లేదు కాబట్టి సరిపోయింది.. లేదంటే చాలా నష్టం జరిగి ఉండేదంటున్నారు గ్రామస్థులు.